26-02-2025 04:29:14 PM
హజారీబాగ్,(విజయక్రాంతి): జార్ఖండ్‌లోని హజారీబాగ్ లో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు(Violent Clashes) చెలరేగాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం హజారీబాగ్‌లోని డమ్రౌన్ గ్రామం హిందూస్తాన్ చౌక్‌లో జెండాలు, లౌడ్‌స్పీకర్లు ఏర్పాటు చేయడంపై రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. రెండు వైపులా రాళ్లు దాడి చేయడంతో పాటు పలు వాహనాలు, దుకాణాలకు ఆందోనకారులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని లాఠీ ఛార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. శాంతిభద్రతలను కాపాడటానికి పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బందిని సంఘటన స్థలంలో మోహరించారు. క్షతగాత్రులను చికిత్స కోసం హజారీబాగ్ సదర్ ఆసుపత్రికి తరలించారు.
హజారీబాగ్‌లోని హిందూస్తాన్ చౌక్‌లో జరిగిన హింసాత్మక ఘర్షణను కేంద్ర మంత్రి, రాంచీ బీజేపీ ఎంపీ సంజయ్ సేథ్(MP Sanjay Seth) ఖండించారు. సరస్వతి పూజ, రామనవమి, హోలీ సందర్భంగా హింస జార్ఖండ్‌లో సర్వసాధారణమైపోయిందని మండిపడ్డారు. బంగ్లాదేశ్ చొరబాటుదారులే ఇలాంటి సంఘటనలకు కారణమని ఆయన ఆరోపించారు. శాంతిని ప్రభావితం చేయాలనుకునే వ్యక్తులు ఎవరు..? అని దేశంలో ఎక్కడా హింస జరగదు.. కానీ జార్ఖండ్‌లో జరుగుతుందన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ చొరబాటుదారులు దేశ ప్రజల శాంతిభద్రతలను ప్రభావితం చేస్తున్నారని సంజయ్ సేథ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.