22-02-2025 12:00:00 AM
ఆజంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులు
కాటారం (భూపాలపల్లి), ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : జయశంకర్ భూపాలపల్లి మండల పరిధిలోని ఆజంనగర్‌లో పోడు రైతులకు, అటవీశాఖ అధికారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆజంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి మండలం ఆజంనగర్ గ్రామ శివారులో గల పోడు భూములను సాగు చేసుకుంటున్న భూములను గుర్తించి ట్రెం ఏర్పాటు చేయడానికి అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగడంతో ఆ గ్రామానికి చెందిన రైతులకు, అటవీ శాఖ అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
కొంతకాలంగా పోడును కొట్టి సేద్యం చేసుకుంటున్న భూములను అటవీశాఖ అధికారులు అన్యాయంగా గుంజుకోవాలని చూస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పోడు భూములకు పట్టాలిస్తామని ప్రభుత్వం ఓ పక్క చెబుతున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు దాడులకు దిగడం సమంజసం కాదని రైతాంగం మొరపెట్టుకుంటున్నారు.
భూపాలపల్లి జిల్లా డీఎఫ్‌ఓ నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో భూపాలపల్లి రేంజర్ నరేష్, ఆజంనగర్ డిఆర్‌ఓ ఉషారాణి ఆధ్వర్యంలో వివిధ రేంజ్ ల పరిధిలోని అటవీ శాఖ సిబ్బంది సుమారు 150 మంది వాహనాలలో ఆజంనగర్ పోడు భూములను చుట్టుముట్టారు. రెండు జెసిబి లతో ట్రెం లను తవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, రైతులు భూముల వద్దకు రాగా, అటవీ శాఖ అధికారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
మహిళలను అటవీ శాఖ అధికారులు తోసివేసారని గ్రామస్తులు పేర్కొంటుండగా, అటవీశాఖ అధికారులు, సిబ్బందిపై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారని ఆశాఖ అధికారులు పేర్కొంటున్నారు. పరస్పర దాడుల నేపథ్యంలో ఆజంనగర్‌లో ఉద్రిక్త పరిస్థితులను నెలకొన్నాయి.