calender_icon.png 21 September, 2024 | 9:08 PM

టీఎస్‌ఈఆర్సీ డీడీ నియామకంపై వివరణ ఇవ్వండి: హైకోర్టు

20-09-2024 02:27:48 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్ (టీఎస్‌ఈఆర్సీ) డిప్యూటీ డైరెక్టర్‌గా ఆర్ లక్ష్మారెడ్డి నియామకానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి, టీఎస్‌ఈఆర్సీకి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.  టీఎస్‌ఈఆర్సీ డిప్యూటీ డైరెక్టర్ (కన్సూమర్ అసిస్టెన్స్)గా రొండ్ల లక్ష్మారెడ్డిని నియమిం చడాన్ని సవాలు చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఎం శ్రీధర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నియామకాలు నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం జరగలేదని అన్నారు.

కమిషన్‌లో ఉన్న 11 పోస్టులను దొడ్డిదారిన నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని విక్రయిస్తున్నారన్న ఆరోపణలున్నాయని, వీటిపై ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఎంపికైనవారి వివరాలను ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో కూడా పెట్టలేదని ఆరోపించారు. డిప్యూటీ డైరెక్టర్ పోస్టుకు 87 మంది దరఖాస్తు చేసుకున్నారని, 86 మందికి జరుగుతున్న పరిణామాలు తెలియకుండా చీకటిలో ఉంచి లక్ష్మారెడ్డిని నియమించారని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి డిప్యూటీ డైరెక్టర్ నియామకంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేశారు.