calender_icon.png 23 September, 2024 | 4:42 AM

ట్రైబల్స్ కథకు క్లాప్స్

22-09-2024 12:00:00 AM

ఒక సింహాసనం కోసం రెండు తెగలు పోటీ పడ్డ తీరును ఆసక్తికరంగా చెప్తే అది ‘సలార్’ సినిమా కథ అయింది.. తమ హక్కుల కోసం ఓ గిరిజన తెగ నాయకుడి ఆధ్వర్యంలో సాగిన పోరాటం తీరుతెన్నులను తెరపై ఆవిష్కరించింది ‘తంగలాన్’ చిత్రం.. సముద్ర తీరపు ఆదివాసీల కోసం ఓ వ్యక్తి సాగించిన పోరాట పటిమను తెలియజెసే ప్రయత్నంలో సిద్ధమైన కథ పేరు ‘దేవర’.. ఇలా స్టోరీ పాయింట్ ఏదైనా ఈ సినిమాలన్నింటిలోనూ కనిపించే కామన్ పాయింట్ ‘ట్రైబల్’. ఆదివాసీ గిరిజన నేపథ్యపు స్క్రిప్టును సిద్ధం చేసుకొని, ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొడుతున్నారు.. 

ఆ సినిమాలకు ప్రేక్షకులు సైతం క్లాప్స్ కొట్టేస్తున్నారు.  

ఆదివాసీలు, గిరిజనులు.. పేరేదైనా అడవి తల్లిని నమ్ముకొని జీవించే తెగలు భారతదేశంలో కోకొల్లలు. ఆ ఆదిమ జాతుల నేపథ్యంలో కథలు అల్లుకొని తీస్తున్న సినిమాలకు ప్రేక్షక లోకం జేజేలు పలుకుతున్నారు. ట్రైబల్స్ నేటివిటీతో వచ్చిన చిత్రాలన్నీ విచిత్ర చర్చకు తెర తీస్తున్నాయి. ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమాలు కొన్ని ఈమధ్య సగటు ప్రేక్షకులను మెప్పించగా, ఇదే కోవలో మరికొన్ని చిత్రాలు ముస్తాబవుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి సినిమాల రూపంలో ఆదిమ జాతులు వెండితెరపై వెలుగొందుతున్నాయి. తద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ, గిరిజన తెగలు సినీ ప్రియులకు పరిచయమవుతన్నాయి. అదే సమయంలో మూవీ మేకర్స్ జేబులు నింపుతున్నాయి. 

తెగల మధ్య పోరాటమే ‘సలార్’  

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా మొదటి భాగం ‘సలార్: సీజ్‌ఫైర్’ గత ఏడాది ప్రేక్షకాదరణ పొందింది. కాన్సార్ సింహాసనం కోసం శౌర్యాంగ, ఘనియార్ తెగలు పోటీపడటం, వారికి దక్కుకుండా తన సింహాసనాన్ని కాపాడుకోవటం కోసం మన్నార్ తెగకు చెందిన రాజ మన్నార్ చేసే ప్రయత్నం.. ఈ మూడు తెగలు ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచించడం మొదటి భాగంలో చూపించారు. చివరికి ఏ తెగవారు కాన్సార్ సింహాసనాన్ని చేజిక్కించుకున్నారనేది పార్ట్ చూపించనున్నారు. ‘సలార్: శౌర్యాంగ పర్వం’ విడుదల వరకు ఆగాల్సిందే. ఇంకా ఈ రెండో భాగం చిత్రీకరణ ప్రారంభం కాలేదు. 

హక్కుల కోసం రగల్ జెండా ఎత్తిన ‘తంగలాన్’

పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాలతో ఈ చిత్రం రూపొందింది. బంగారం గనుల తవ్వకాన్ని వ్యతిరేకించే గిరిజన తెగ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఆ తెగ నాయకుడి పాత్రలో విక్రమ్ నటించారు. 

‘కంగువ’.. ఓ తెగ నాయకుడే

సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘కంగువ’. శివ దర్శకత్వంలో కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రంలో సూర్య ఆటవిక జాతికి చెందిన ఓ తెగ నాయకుడిగా నటించారు. ఓ దట్టమైన అడవిలో రెండు ఆటవిక జాతుల మధ్య పోరాటం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఈ సినిమా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఓ గిరిజన యోధుడైన కంగువ 1678 నుంచి ప్రస్తు కాలానికి వస్తాడు. ఓ మహిళా సైంటిస్ట్ సహాయంతో తన మిషన్‌ను పూర్తి చేయాలనుకుంటాడు. ఆ మిషన్ ఏంటి? ఆ కాలం నుంచి ఇప్పటి కాలానికి అతను టైమ్ ట్రావెల్ ఎలా చేశాడు? అనే నేపథ్యంలో భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలతో ఈ సినిమా కథ సాగుతుందట. ఈ సినిమా నవంబర్ 14న విడుదల కానుంది. 

శివభక్తుడు  ‘కన్నప్ప’ ఓ తెగకు చెందిన తిన్నడు 

మంచు విష్ణు నటిస్తున్న చిత్రం ‘కన్నప్ప’ ముఖేశ్‌కుమార్ సింగ్ దర్శకత్వంలో వస్తోంది. దీన్ని మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం వంటి వారు ముఖ్య పాత్రధారులు. ఓ తెగకు చెందిన తిన్నడు అనే వ్యక్తి శివ భక్తుడు కన్నప్పగా మారిన నేపథ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విష్ణు టైటిల్ రోల్ చేస్తున్నారు. తన బిడ్డ తిన్నడు ధైర్యసాహసాలకు ముగ్ధుడైన నాథనాథుడు ప్రత్యేకమైన విల్లును తయారు చేస్తాడు. ఆ విల్లును ఉపయోగిస్తూ తన తెగను, అడవిలో సమతుల్యతను తిన్నడు ఎలా కాపాడాడు? అనే నేపథ్యంలో సాగే సీన్లతో వస్తున్న ఈ సినిమా ఆకట్టుకోనుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. 

ఆఫ్రికన్ అడవుల్లో చిత్రీకరణ

మహేశ్‌బాబు హీరోగా ఎస్‌ఎస్ రాజమౌళి ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ‘ఎస్‌ఎస్‌ఎంబీ29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉంది. ఇది అమెజాన్ ఫారెస్ట్ ట్రజర్ హంట్ నేపథ్యంలో ఉంటుందట. ఆఫ్రికన్ అడవుల్లో ఉండే భయంకరమైన తెగ ప్రస్తావన ఇందులో ఉంటుందని వినికిడి. ఈ గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్టును దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1500 కోట్లు ఖర్చు చేయనున్నారట. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కోసం సాంకేతిక నిపుణుల బృందానికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నారట జక్కన్న.  దీన్ని మూడు భాగాలుగా తీస్తున్నారట.

తొలి భాగంలో మహేశ్ కథానాయకుడు కాగా, మిగతా రెండు భాగాల్లో హాలీవుడ్ స్టార్‌తోపాటు వివిధ భాషలకు చెందిన నటీ నటులు కనిపించనున్నారని టాక్. ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ కథానాయిక అని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో మహేశ్‌బాబు పాత్రకు సంబంధించిన డైలాగ్ డెలివరీ మాండలికం, పదాల ఉచ్ఛరణ వంటి అంశాలన్నీ పాపులర్ నటుడు నాజర్ దగ్గరుండి చూసుకోనున్నారట. ఈ సినిమా కోసం మహేశ్ బాబు ఇప్పటికే లాంగ్ హెయిర్స్‌తో స్టులిష్ లుక్‌లోకి మేకోవర్ అయ్యాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ప్రాజెక్టు 2025 జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనుందట.  

సముద్ర తీరంలో ‘తెగ’వ చూపే దేవర

హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘దేవర’. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ‘తంగం’ అనే గిరిజన అమ్మాయి పాత్రలో నటిస్తోందీ జూనియర్ అతిలోక సుందరి. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారతదేశంలో విస్మరణకు గురైన సముద్ర తీర ప్రాంతాలకు చెందిన ఆదివాసీల కోసం దేవర చేసే పోరాటమే ఈ సినిమా. ఇదే నెల 27న విడుదల కానుందీ చిత్రం.