20-04-2025 12:00:00 AM
అర్జున్ సన్నాఫ్ వైజయంతిలో విజయశాంతి మరోసారి..
లేడీ సూపర్ స్టార్‌గా, రాములమ్మగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు విజయశాంతి. ముఖ్యంగా లేడీ పోలీస్ ఆఫీసర్ అనగానే సినీప్రియులందరికీ గుర్తుకొచ్చేది ‘కర్తవ్యం’ చిత్రమే. ఆ సినిమాలో ఐపీఎస్ ఆఫీసర్ పాత్రలో నటించిన విజయశాంతి సమకాలీన స్టార్ హీరోలకు ధీటైన పోటీ ఇవ్వడం ద్వారా వారికి సరిసమానమైన ఇమేజ్‌ను పొందారు.
తాజాగా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో మరోమారు పోలీస్ ఆఫీసర్‌గా థియేటర్లలో సందడి చేస్తున్నారు. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆయనకు తల్లిగా విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలైంది.
‘కనిపించే ఆ నాలుగు సింహాలు సత్యం, ధర్మం, న్యాయం అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమేరా ఈ పోలీస్’ అంటూ సాయికుమార్ చెప్పిన ఎవర్‌గ్రీన్ డైలాగ్‌ను మర్చిపోగలమా? అప్పట్లో అంతటి ప్రభావం చూపింది ‘పోలీస్‌స్టోరీ’ సినిమా. నేరాల అదుపునకు కృషిచేసే నిజయితీగల పోలీస్ ఆఫీసర్‌కు దక్కే గౌరవమే వేరు. నిజ జీవితం మాట అటుంచితే.. వెండితెరపై పోలీస్ ఆఫీసర్ పాత్రలకు ఉండే క్రేజ్ వీర లెవల్. అందుకే టాలీవుడ్ ఇప్పుడు కాప్ రోల్స్‌కు క్లాప్స్ కొడుతోంది.
నట సార్వభౌముడి నుంచి నవతరం దాకా సగటు హీరోలు పోలీసు వేషం కట్టినవారే. అయితే తరతరాలు చెప్పుకునేలా కొన్ని సినిమాలు, పాత్రలు సినీచరిత్రలో స్థానాన్ని పదిలపర్చుకున్నాయి. మరీ అంత గొప్పగా కాకున్నా మరికొందరు నటులు కూడా పోలీసు పాత్రల్లో మెప్పించారు.
హీరోయిజం చూపించాలంటే పోలీస్ పాత్ర తర్వాతే ఏదైనా. ఎందుకంటే ఎమోషన్, మాస్ ఉండేది ఆ క్యారెక్టర్‌లోనే. ‘స్టువర్టుపురం పోలీస్‌స్టేషన్’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి తదితర సినిమాల్లో చిరంజీవి, ‘క్రిమినల్’లో నాగార్జున, ‘అంకుశం’లో రాజశేఖర్, ‘గబ్బర్‌సింగ్’లో పవన్‌కల్యాణ్, ‘పోకిరి’లో మహేశ్‌బాబు, ‘టెంపర్’లో జూనియర్ ఎన్టీఆర్, ‘ఆర్‌ఆర్‌ఆర్’లో రామ్‌చరణ్, ‘విక్రమార్కుడు’లో రవితేజ, ‘పోలీస్‌స్టోరీ’లో సాయికుమార్..
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే. తమదైన మేనరిజంతో ప్రేక్షకుల మనసు గెలిచినవారే. వీళ్లందరివీ పోలీస్ అధికారి పాత్రలే అయినా ఒక్కొక్కరికీ ఒక్కో స్థాయి గుర్తింపు దక్కడం వెనుకున్న కారణం మాత్రం.. కథ, కథనం, పాత్ర చిత్రీకరణం, కథలో ఆ పాత్రకుండే ప్రాధాన్యం, నట ప్రతిభ ఇవన్నీ కారణాలే అని చెప్పొచ్చు.
‘స్పిరిట్’లో ప్రభాస్ తొలిసారిగా..
ఖాకీ డ్రెస్‌లో ఉండే ఎలివేషన్ ఏపాటిదో అందరికీ తెలిసిందే. ఆ పాత్రలో మెప్పించేందుకు కొందరు హీరోలు రాబోతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ రోల్‌లో కనిపించబోతున్నారు. ప్రభాస్ కెరీర్‌లో ఇప్పటి వరకూ పోలీస్ రోల్ చెయ్యలేదు. అందుకే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ లుక్‌లో ఎలా ఉండబోతున్నారన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
కలిసివచ్చిన పాత్రలో రవితేజ ‘మాస్ జాతర’
రవితేజ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ పోలీస్‌గా చేసిన సినిమాలే. అందుకే తనకు కలిసొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో ‘మాస్ జాతర’ సినిమాలో మరోమారు కనిపించ నున్నారు రవితేజ. ఈ చిత్రానికి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. వరస ఫ్లాపుల తర్వాత ఈ సినిమాతో వస్తున్న రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి.
‘హిట్3’లో నాని..
పక్కింటి అబ్బాయిలా సింపుల్‌గా ఉన్న నాని ‘దసరా’, ‘సరిపోదా శనివారం’లతో మాస్‌గా మారిపోయాడు. మరో అడుగు ముందుకేసి ఈసారి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. ‘హిట్3: ది థర్డ్ కేస్’లో అర్జున్ సర్కార్ అనే పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. నాని ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి విభిన్నంగా రూపొందుతున్న ఈ సినిమా మే 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’..
ఇప్పటివరకు రౌడీ హీరోగా, మాస్ లుక్‌లో కనిపించే పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ ఈ కాప్ స్టోరీతో వస్తున్నారు. ఆయన హీరోగా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి పవర్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘కింగ్‌డమ్’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్పైగా, హెవీ ఎమోషన్స్ ఉన్న కాప్ రోల్ ప్లే చేస్తున్నాడట. మే 30న రిలీజ్ కానుందీ కాప్ డ్రామా.
విశ్వక్‌సేన్ 13వ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌గా..
ఇటీవల ‘లైలా’గా ఆడ వేషంలో అలరించిన విశ్వక్‌సేన్ మరోసారి పోలీస్‌గా కనిపించనున్నాడు. ‘హిట్’ చిత్రంలో ఇప్పటికే పోలీస్ రోల్ చేసి హిట్ అందుకున్నాడు. మళ్లీ ఇప్పుడు తన 13వ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. ఈ చిత్రం శ్రీధర్ గంటా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.