డీజిల్ ట్యాంకర్ స్వాధీనం..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కాజీపేట మండలంలోని దేవాపూర్ సల్పల వాగు, కొండాపూర్ యాప రహదారి మధ్యలో స్మశాన వాటిక సమీపంలో అక్రమంగా నడుస్తున్న డీజిల్ సరఫరా స్థావరంపై గురువారం రాత్రి సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వాహకులు సొంతంగా బంకు ఏర్పాటు చేసుకొని లారీలకు డీజిల్ పోస్తుండగా సివిల్ సప్లై అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డీజిల్ ట్యాంకర్ కు అక్రమంగా పంపు ఏర్పాటు చేసి దేవాపూర్ సిమెంట్ కంపెనీలో సిమెంటు రవాణా చేసే లారీలకు డీజిల్ పోస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
ఈ సమాచారం తెలుసుకున్న సివిల్ సప్లై అధికారులు డీజిల్ స్థావరంపై మెరుపు దాడి చేశారు. అధికారులు దాడులు చేసిన సమయంలో ఒక డీజిల్ ట్యాంకర్, పంపుతో నిర్వాహకులు పట్టుబడ్డారు. వెంటనే డీజిల్ ట్యాంకర్ లారీని సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. ఇలాంటి అనుమతులు లేకుండా అక్రమ ట్యాంకర్ కు పంపు ఏర్పాటు చేసి డీజిల్ అమ్మకాలు సాహిత్యం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు సివిల్ సప్లై అధికారులు నిర్ధారించారు.