కొత్తగూడెం లో ప్లే కార్డులతో ప్రదర్శన
భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురం మణుగూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేసిన పౌరహక్కుల సంఘం నాయకులను తక్షణమే విడుదల చేయాలని ప్రజా హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సింగ ఉపేందర్ డిమాండ్ చేశారు. కొత్తగూడెం బస్టాండ్ సమీపంలో ప్లే కార్డు లతో ప్రదర్శన నిర్వహించారు.
కరకగూడెం మండలం రఘునాధపాలెం వద్ద జరిగిన ఎన్కౌంటర్ను పరిశీలనచేందుకు వెళ్తున్న తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణతో పాటు మరో 9 మంది నాయకులను మణుగూరు పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆయన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు కలిసి చట్ట విరుద్ధంగా పౌర హక్కుల సంఘం నాయకులను నిర్బంధిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఎన్కౌంటర్లో తప్పిదాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు పౌర కోసం నాయకులను నిర్బంధించారని ఆయన అన్నారు. బేషరతుగా నిర్బంధించిన పౌర హక్కు సంఘ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇఫ్ట్ రాష్ట్ర నాయకులు జడ సత్యనారాయణ, గౌను నాగేశ్వరరావు, ప్రజా సంఘం నాయకులు సురేష్ కుమార్, మూర్తి, ఆర్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.