- ప్రపంచస్థాయి సదుపాయాలతో హైదరాబాద్‌కు పరిశ్రమల రాక
- ఫిబ్రవరి 24 నుంచి హైదరాబాద్‌లో బయో ఏషియా సదస్సు
- ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
- ఇండో లైఫ్ సైన్సెస్ సదస్సు ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): ప్రపంచస్థాయి మౌలిక సదుపా యాల కల్పన, పారిశ్రామిక అనుకూల వాతావరణం కారణంగా హైదరాబాద్ నగరం భారతదేశ లైఫ్‌సైన్సెస్ క్యాపిటల్‌గా ఎదిగిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
మంగళవారం మాదాపూర్‌లోని ఆవాసా హోటల్‌లో ఇండో లైఫ్ సైన్సెస్ సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం టీకాలు, జనరిక్ ఔషధాలు, క్యాన్సర్, ఇతర సంక్లిష్ట వ్యాధుల నివారణకు అవసరమైన బయోసిమిలర్స్ ఉత్పత్తిలో ప్రపంచ గమ్యస్థానంగా వృద్ధి చెందిందని వెల్లడించారు.
లైఫ్‌సైన్సెస్ రంగంలో మరింత ముందడుగు వేసే దిశగా ప్రస్థానం కొనసాగుతోందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 33 శాతం వ్యాక్సిన్లు, జనరిక్ ఔషధాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతాయని గుర్తు చేశారు. కొత్త అవకాశాలు, అనుకూల వాతావరణంతో బెల్జియం లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు.
ఇక్కడ నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. యూరోపియన్ యూనియన్‌లో రెండో అతిపెద్ద ఔషధ ఎగుమతిదారుగా ఉన్న బెల్జియం, ఆరోగ్య రంగంలో విప్లవాత్మకమైన ఆవిష్కరణలతో ముందంజలో ఉందని వెల్లడించారు. బలమైన భాగస్వామ్యం ద్వారా రెండు దేశాలు పరస్పర ప్రయోజనం పొందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ సదస్సు ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో నూతన మైలురాళ్లను చేరుకునే ఒక సహకార వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. డా.అజిత్ షెట్టి, డా.పీటర్ పియోట్ లాంటి ప్రముఖుల ద్వారా బెల్జియంతో ఇప్పటికే అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. బెల్జియంలోని ఫ్లాండర్స్ రాష్ట్రం, తెలంగాణ లైఫ్ సైన్సెస్‌ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం అమలులో ఉందని పేర్కొన్నారు.
ఈ సదస్సు ద్వారా ఫ్లామిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ, వ్యాక్సినో పోలీస్, యూనివర్సిటీ ఆఫ్ గెంట్ వంటి సంస్థలతో భాగస్వామ్య అవకాశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ప్రాణరక్షక ఆవిష్కరణలను అందరికీ చౌకగా అందించడం వంటి లక్ష్యాలను పాటించే దిశలో రెండు దేశాలు ముందుకు సాగాలని కోరారు.
రానున్న ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల మధ్య హైదరాబాద్‌లో జరగనున్న బయో ఏషియా ప్రపంచస్థాయి సదస్సులో బెల్జియం దేశానికి చెందిన ప్రముఖులు కూడా పాల్గొనాలని ఆహ్వానించారు.
సదస్సులో బెల్జియం రాయబారి డిడియర్ వాండర్హాసెల్ట్, ద్వైపాక్షిక వ్యవహారాల డైరెక్టర్ జనరల్ జీరోన్ కూర్మన్, డా.రెడ్డీస్ మేనేజింగ్ డైరెక్టర్ జీ.వీ.ప్రసాద్, బయో ఏషియా అంతర్జాతీయ సలహా మండలి చైర్మన్ డా.అజిత్‌షెట్టి, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ప్రొ.డా.పీటర్ పియోట్, ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్ పర్సన్ డా.సౌమ్య స్వామినాథన్, ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయెన్స్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ జైన్, పలువురు శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారు.