calender_icon.png 27 April, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికుల హక్కులను కాలరాసే కుట్ర చేస్తున్న బీజేపీకి గుణపాఠం తప్పదు

26-04-2025 09:33:48 PM

సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి

మునుగోడు,(విజయక్రాంతి): నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగానికి విరుద్ధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కార్మిక హక్కులను కట్టు బానిసలుగా మార్చేందుకు పెద్ద కుట్ర చేస్తున్నాదని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలో సిఐటియు మునుగోడు మండల జనరల్ బాడీ సమావేశం సిఐటియు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు అధ్యక్షతన నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు నిర్వహించతలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కార్మిక వర్గం సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.

కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి హక్కులను పోరాడి సాధించుకున్న మే1న ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని మండలంలో అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఆ మేడే అమరవీరుల స్ఫూర్తితో వారు సాధించిన హక్కులపై బిజెపి ప్రభుత్వం చేస్తున్న దాడికి వ్యతిరేకంగా మే 20న 11 కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఫెడరేషన్లు దేశవ్యాప్తంగా చేస్తున్న సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. నెహ్రు బ్రిటిష్ పాలనలో కూడా దేశంలో అమలు చేసిన చట్టాలను బిజెపి ప్రభుత్వం వ్యతిరేకించడం దారుణం అని మండిపడ్డారు.

77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని అన్నారు.ఈ ప్రైవేటీకరణతో సామాజిక న్యాయం దెబ్బతింటుందని రిజర్వేషన్లు రద్దు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే ధరలు ఆకాశాన్ని  అంటుతుంటే మళ్లీ పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. 11ఏళ్ల బిజెపి పాలనలో దేశం అన్ని రంగాల్లో అధోగతి పాలైందని అన్ని తరగతుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రజల మధ్యన కుల మతాల పేరుతో విభజన సృష్టించి రాజకీయం పబ్బం గడుపుతుందని అన్నారు.

మోడీ విధానాలపై కార్మిక వర్గం ప్రతిఘటనే మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మె అని అన్నారు.145 కోట్ల ప్రజల ప్రయోజనాల కోసం జరిగే ఈ దేశభక్తియుత సమ్మెలోకార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం,  రైతు సంఘం జిల్లా నాయకులు సాగర్ల మల్లేష్, డివైఎఫ్ఐ జిల్లా సహా కార్యదర్శి మిర్యాల భరత్, రైతు సంఘం మండల కార్యదర్శి వేముల లింగస్వామి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు జీడిమడ్ల సైదులు, ఎర్ర అరుణ, ఎన్ లక్ష్మి, నీరుడు రాజ్యలక్ష్మి, ఎన్ పెద్దమ్మ, సంపూర్ణ, లలిత, సరిత, టి.ధనలక్ష్మి, ఎస్ వసుమతి, ఎన్ లింగమ్మ, పి.పద్మ, సీహెచ్ గంగ ఉన్నారు.