ప్రతి నెల 7వ తేదిన వేతనాలు చెల్లించాలి
సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్
మందమర్రి,(విజయక్రాంతి): ఏరియాలో పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి నెల ఏడవ తేదీన వేతనాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతోనే నేలంతా కష్టపడి పని చేసిన వేతనాలు రాక, పండుగ పూట కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్(CITU State President Dhulam Srinivas) శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దూలం శ్రీనివాస్ మాట్లాడుతూ... సింగరేణి యాజమాన్యం(Singareni Management) కాంట్రాక్టు కార్మికులకు కాంట్రాక్టర్ బిల్లులతో సంబంధం లేకుండా, ప్రతినెల ఏడవ తేదీన జీతం చిట్టీలు, వేతనాలు చెల్లించాలని సర్క్యులర్ జారీ చేసిన దానిని అమలు చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు.
ఏడవ తేదీన వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ల పైన ఎలాంటి చర్యలు అధికారులు తీసుకోకపోవడం మూలంగా కాంట్రాక్టర్లకు వీలైనప్పుడు కార్మికులకు వేతనాలు చెల్లిస్తున్నారని, దీని మూలంగా నెలంతా కష్టపడి పనిచేసిన, ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియని అయోమయంలో కాంట్రాక్టు కార్మికులు వేతనాలు కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏరియాలో ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల విషయంలో ప్రతినెల ఇదే తంతు కొనసాగుతుందని, అధికారులకు ఎన్నిసార్లు విన్నవించిన, అది నీటి మూటగానే మిగిలిపోతుంది తప్ప, కాంట్రాక్టర్ల పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని మండిపడ్డారు. ఆర్కెపి సిహెచ్పి లో రైల్వేసైడ్ కార్మికులు, బి జోన్ సివిక్ కాంట్రాక్టు ఇలా ఏ సెక్షన్ లో చూసిన, ఎప్పుడు వేతనాలు పడతాయో తెలియని దుస్థితి నెలకొందని ఆన్నారు.. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు ప్రతి నెల 7వ తేదీన వేతనాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసే కాంట్రాక్టర్ల పైన తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన పోరాటాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.