అమెరికా అధ్యక్ష ఎన్నికలకు పోటాపోటీగా ప్రచారం
ఓటరు నమోదును ప్రోత్సహిస్తున్న ప్రధాన పార్టీలు
గ్రీన్‌కార్డు హోల్డర్లు ఓటరుగా నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ, జూలై 30 : అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రీన్‌కార్డు హోల్డర్లు తమ పౌరసత్వాన్ని పొంది ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆసియా అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్మన్, వ్యవస్థాపకుడు శేఖర్ నరసింహన్ పిలుపునిచ్చారు. అర్హులైన గ్రీన్ కార్డు హోల్డర్లు కేవలం మూడు వారాల్లోనే అమెరికా పౌరసత్వం పొందవచ్చని తెలిపారు. “మీకు గ్రీన్ కార్డు ఉండి, ఐదేళ్లు పూర్తయినటైతే పౌరసత్వం పొందండి. ఓటరుగా నమోదు చేసుకోండి” అని నరసింహన్ పేర్కొన్నారు.
నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) డేటా ప్రకారం, దాదాపు 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వివిధ వృత్తి నిపుణులు అమెరికాలో శాశ్వత నివాసం కోసం వేచి చూస్తున్న వారిలో ఉన్నారు. అమెరికాలో శాశ్వతంగా నివసించేందుకు గాను గ్రీన్‌కార్డు జారీ చేస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం, 2022 నాటికి అమెరికాలో 12.9 మిలియన్ల మంది గ్రీన్ కార్డ్ హోల్డర్లు నివసిస్తున్నారు. 9.2 మిలియన్ల మంది పౌరసత్వం పొందేందుకు అర్హత సాధించారు. మరోవైపు, 2023 ఏడాదిలో 59 వేల మంది భారతీయులు అమెరికా పౌరసత్వం పొందారు.