calender_icon.png 7 January, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సినిమా పాన్ ఇండియా..ఈవెంట్స్ నాన్ ఇండియా!

05-01-2025 12:37:59 AM

తెలుగు సినిమా.. భారీ బడ్జెట్, లేదంటే సింపుల్ బడ్జెట్. సినిమా ఏదైనా బాక్సాఫీస్‌ను ఒక ఆటాడుకుంటోంది. 

పెద్ద మూవీ ‘పుష్ప ది రూల్’ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సింపుల్ బడ్జెట్‌తో రూపొందిన ‘క’ మూవీ సైతం బాక్సాఫీస్‌ను గడగడలాడించింది. కంటెంట్‌లో దమ్ముంటే చాలు.. చిన్నదా.. పెద్దదా చూడరు ప్రేక్షకులు. ఇది సినిమా రిలీజ్ అయ్యాక కథ. అవక ముందు సంగతేంటి? పాన్ ఇండియా సినిమా అయితే ఛలో అమెరికా.. ఆపై ముంబై.. ఢిల్లీ. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు.. సక్సెస్ మీట్ సైతం వేరే రాష్ట్రంలోనే.  టికెట్స్ ఎక్కువగా చిరిగేది ఇక్కడ.. ఈవెంట్స్ అక్కడ! దీని వెనకున్న కథాకమామిషూ ఏంటి? 

పాన్ ఇండియా మూవీసే కదా.. మరెందుకు పాన్ వరల్డ్ మూవీ అన్నట్టుగా దేశాన్ని వీడి అగ్రరాజ్యంలో ప్రి రిలీజ్ ఈవెంట్. కలెక్షన్స్ ఎక్కువగా వచ్చేది తెలుగు రాష్ట్రాల నుంచే కదా. అయినా కూడా తెలుగు రాష్ట్రాల్లో చప్పగా.. అగ్రరాజ్యంలో సౌండ్ పెంచుతున్నారు? ‘గేమ్ చేంజర్’తో మొదలైన చలో అమెరికా సంస్కృతిని ‘డాకు మహారాజ్’ సైతం కొనసాగిస్తోంది.

ఇద్దరు హీరోలూ పేరు లేనోళ్లేమీ కాదు. కోట్ల మంది తెలుగు వారి హృదయాల్లో కొలువైనోళ్లు. ఇక్కడి అభిమానులు తమ అభిమాన హీరో సినిమా నుంచి అప్‌డేట్ రాకుంటే ఏకంగా ఆత్మహత్య చేసుకుని చనిపోతామంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంతటి వెర్రి అభిమానాన్ని కాదని ఎక్కడో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఏంటి? అంటే మేకర్స్ సమాధానం ఏం చెప్తారు. 

రూపాయి కన్నా డాలర్‌పైనే కన్ను..

అగ్రరాజ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే ప్రపంచాన్ని ఆకర్షించవచ్చు. సినిమాకు హైప్‌ను పెంచవచ్చు. అలాగే రూపాయి మీద కంటే డాలర్ మీదనే ఎక్కువగా నిర్మాతలు ఫోకస్ పెడుతున్నట్టున్నారు. అక్కడ రూపాయొస్తే.. ఇండియాలో దానిలో పావు వంతు కూడా రాదు. కాబట్టి అక్కడ కలెక్షన్స్ పెంచుకునేందుకు యత్నం కూడా అయ్యుండొచ్చు.

ఇందు లో తప్పేమీ లేదు. ఎంతో వ్యయప్రయాసలకోర్చి సినిమా తీస్తారు కాబట్టి లాభాపేక్ష లేకుండా ఉండదు. కానీ తెలుగు రాష్ట్రాల అభిమానులను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు కదా! డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ఆడిటోరియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. బాల య్యకు ఏమైనా తక్కువ వస్తారా? ఆయన అభిమానులు అమెరికాలో ఎక్కువే! చాలా సందర్భాల్లో అమెరికాలోని తెలుగు రెస్టారెంట్స్‌లో బాలయ్య పాటలు పెట్టి ‘జై బాలయ్య’ నినాదాలు చేస్తూ అక్కడి వారు ఎంజాయ్ చేసిన సందర్భాలెన్నో. 

సినిమా ఈవెంట్ అంటేనే హైదరాబాద్..

తమ అభిమాన హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అగ్రరాజ్యంలో పెడుతున్నారని జబ్బలు చరుచుకునే అభిమానులూ ఉన్నారు.. వెళ్లలేకపోతున్నామని బాధపడేవారూ లేకపోలేదు. ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంటే కాదు.. దాని ముందు ఏ ఈవెంట్ అయినా ఇతర రాష్ట్రాల్లోనే పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తున్నారు. సొంత రాష్ట్రంలో సింపుల్‌గా కానిచ్చేస్తున్నారు.

ఇటీవల ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి వస్తున్నారని తెలుసుకుని ఓ యువకుడు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అలా అభిమాన హీరో కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకైనా వచ్చి కళ్లారా చూసుకుంటారు.

అసలు సినిమా ఈవెంట్ అంటేనే హైదరాబాద్ అన్నట్టుగా జనాల మనసుల్లో నాటుకుపోయింది. ఇప్పుడు చూస్తే పరిస్థితులు మారిపోతున్నాయి. ‘పుష్ప 2’ కూడా లక్నో, ముంబై, ఢిల్లీ అంటూ ఇతర రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఈవెంట్స్ నిర్వహించింది. చివరకు సక్సెస్ మీట్స్ ఇతర రాష్ట్రాల్లోనే నిర్వహిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ అన్నీ ఇదే బాటలో పయనిస్తున్నాయి. 

వెంకీ మామ ఇక్కడే.. 

ఇతర రాష్ట్రాల్లో సినిమాపై హైప్ క్రియేట్ చేసుకునే క్రమంలో మేకర్స్ తెలుగు రాష్ట్రాలను విస్మరిస్తున్నారు. ఇక్క డా అదే స్థాయిలో ఈవెంట్ నిర్వహిస్తే తెలుగు ప్రేక్షకులూ సంతోషిస్తారు. ‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో సింపుల్‌గా కానిచ్చేసి రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇది కొంత సంతోషించ దగిన పరిణామమే.

ఎక్కడైతేనేమి తెలుగు రాష్ట్రంలోనే కదా నిర్వహిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కూడా ఆ చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్‌ల సొంత జిల్లా నిజామాబాద్‌లో నిర్వహిస్తుండటం ముదావహం. పాన్ ఇండియా సినిమాలన్నీ ప్రీ రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్, ఇతర ఈవెంట్స్ కోసం వేరే రాష్ట్రం లేదా దేశాన్ని వెదుక్కుంటున్నాయి.

హైదరాబాద్ ఎందుకు పనికి రావడం లేదు? అనేది అంతుపట్టడం లేదు. ‘పుష్ప 2’ ఘటన తర్వాత భయపడిపోయారా? అనే అనుమానాలున్నాయి కానీ అసలు కారణమైతే ఒక్కటే కనిపిస్తోంది. ఉన్న అభిమానులైతే ఎక్కడికీ పోరు.. సొంత రాష్ట్రంలో పెద్ద ఎత్తున టికెట్స్ తెగకా పోవు! కానీ అమెరికాతోపాటు ఇతర రాష్ట్రాల వారిని ఆకట్టుకుంటేనే కదా మార్కెట్ పెరిగేది. సక్సెస్ ‘రేటు’ పెంచుకు నేందుకేగా ఈ ప్రయత్నమంతా!