- కెప్టెన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు నోటీసులు
పోంజీ స్కామ్‌లో నోటీసులిచ్చిన సీఐడీ
బీజడ్ గ్రూపులో క్రికెటర్ల పెట్టుబడులు
ఇన్వెస్టర్లను నమ్మించి ముంచిన బీజడ్ గ్రూపు
న్యూఢిల్లీ, జనవరి 2: ఐపీఎల్ ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ ప్రాంచైజీకి చెందిన ముగ్గురు క్రికెటర్లకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కుంభకోణంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు పేరు మోసిన క్రికెటర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. ఈ నలుగురు క్రికెటర్లు బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పెట్టుబడులు పెట్టినందుకు సీఐడీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నలుగురు క్రికెటర్లు త్వరలోనే విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొన్నట్లు అహ్మదాబాద్ మిర్రర్‌లో రిపోర్ట్ చేశారు.
స్కామ్ ఏంటంటే...
అసలు పోంజీ స్కామ్ ఏంటి? దానికి క్రికెటర్లతో సంబంధం ఏంటి అని అంతా తికమకపడుతున్నారు. గుజరాత్‌కు చెందిన భూపేంద్రసింగ్ జాలా అనే వ్యక్తి... బీజడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో పాటు బీజడ్ ట్రేడర్స్ అనే కంపెనీలను స్థాపించి.. గుజరాత్‌లో విస్తరించాడు. అంతే కాకుండా వీటిల్లో పెట్టుబడి పెడితే బ్యాంకుల కంటే ఎక్కువ మొత్తంలో వడ్డీ ఇవ్వనున్నట్లు అమాయక ప్రజలను నమ్మించాడు.
ఇది నమ్మిన మధ్యతరగతి జనం పెద్ద మొత్తంలో కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. ఆ తర్వాత కంపెనీ అసలు రంగు బయటపడి తాము మోసపోయామని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేసుకుని కంపెనీ సీఈవో భూపేంద్రసింగ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో వారు విచారణను వేగవంతం చేశారు.
క్రికెటర్లు ఏం చేశారంటే..
ఈ స్కామ్ చేసింది జాలా అయితే క్రికెటర్లకు నోటీసులు రావడం ఏంటని అంతా అనుకోవడం సహజం. కానీ ఈ కంపెనీలో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు గిల్, మోహిత్ శర్మ, సాయిసుదర్శన్, రాహుల్ తెవాటియా కూడా పెట్టుబడులు పెట్టారు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రూ. 1.95 కోట్లు ఇందులో పెట్టుబడి పెట్టగా మిగతా క్రికెటర్లు చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టా రు. అందుకే సీఐడీ వీరికి నోటీసులు పంపిం ది. ఈ కేసులో ఇప్పటికే సీఈవో జాలాతో సహా సంబంధమున్న మరో ఏడుగురు వ్యక్తులను కూడా సీఐడీ అరెస్ట్ చేసింది.
పెట్టుబడి పెట్టు.. గోవా ట్రిప్ పట్టు
బీజడ్ కంపెనీ మోసాలకు అంతే లేకుండా పోయింది. వారు అమాయక ప్రజలను ఏ విధంగా వెర్రి వాళ్లను చేసి వారి నుంచి పెట్టుబడుల రూపంలో డబ్బులు రాబట్టారో తెలిస్తే వామ్మో అని అనిపించకమానదు. ఈ కంపెనీలో రూ. 5 లక్షల మేర పెట్టుబడి పెడితే 32 ఇంచుల టీవీ, అంతే కాక రూ. 10 లక్షల మేర పెట్టుబడి పెడితే గోవా ట్రిప్‌కు పంపనున్నట్లు ఆఫర్లు ప్రకటించారు.
ఈ ఆఫర్లను నమ్మిన జనం గుడ్డిగా పెట్టుబడులు పెట్టి నిండా మునిగారు. 11వేల మంది ఇందులో రూ. 450 కోట్ల మేర పెట్టుబడులు పెట్టారు. జాలాను అరెస్ట్ చేసి జనవరి 4 వరకు అతడు కస్టడీలో ఉండనున్నాడు.