calender_icon.png 21 March, 2025 | 2:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారత్‌లో సీఐఏ రహస్య స్థావరాలు..!

20-03-2025 11:38:25 PM

న్యూఢిల్లీ, కోల్‌కతా వేదికగా నిర్వహణ..

కెన్నడీ ఫైల్స్ ద్వారా విషయాలు వెలుగులోకి..

పత్రాలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన రష్యా మీడియా హౌస్..

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన కెన్నడీ ఫైల్స్ ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్‌లో అమెరికా గతంలో రహస్యంగా సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) స్థావరాలను నిర్వహించినట్లు తెలుస్తోంది. మన దేశ ప్రధాన నగరాలైన న్యూఢిల్లీ, కోల్‌కతాలో అమెరికా నిఘా సంస్థ సీఐఏకు రెండు స్థావరాలు ఉండేవని ఫైల్స్‌లో ఉంది. వీటిని బ్లాక్ సైట్స్‌గా అభివర్ణించేవారు. రష్యాకు చెందిన ఆర్టీ మీడియా హౌస్ సీఐఏ స్థావరాల ఏర్పాటుకు సంబంధించిన పత్రాలను ‘ఎక్స్’లో పోస్టు చేసింది. ఈ జాబితాలో కేవలం భారత్ నగరాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిఘా సంస్థకు చెందిన చాలా రహస్య స్థావరాలు వివిధ దేశాల్లో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

వీటిలో పాకిస్థాన్‌కు చెందిన రావల్పిండి, శ్రీలంకలోని కొలంబియా, ఇరాన్‌లోని టెహ్రాన్, దక్షిణ కొరియాలోని సియోల్, జపాన్‌లోని టోక్యో పేర్లున్నాయి. గతంలో కూడా సీఐఏకు సంబంధించి భారత్‌లో కార్యకలాపాలు జరిగినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య దర్యాప్తు ఫైల్స్‌ను విడుదల చేశారు. దీనిలో సీఐఏ పాత్రపై ఆసక్తికర విషయాలు దాగున్నాయి. మొత్తం 63 వేల పేజీలు 2,200 ఫైల్స్ రూపంలో ఉన్నాయి. అమెరికాలోని నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వీటిని బహిర్గతం చేసింది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జాన్ ఎఫ్ కెన్నడీ.. 1963 నవంబర్ 22న డల్లాస్‌లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే.