01-03-2025 10:16:19 PM
రహదారి ఆక్రమణలను తొలగించాలని ఆదేశం
టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండల కేంద్రంలోని బోడు రోడ్ సెంటర్లో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు టేకులపల్లి సిఐ తాటిపాముల సురేష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. సైడ్ కాల్వల మీదకు వ్యాపారాలు చేస్తుండటంతో వ్యాపారులను పిలిచి ఎవరు కూడా సైడ్ కాల్వ దాటి ఉండ కూడదని, సైడ్ కాల్వపై కూడా వేసిన రేకులను కూడా తొలగించాలని ఆదేశించారు. రెండు రోజుల్లో తొలగించక పొతే తామే తొలగించాల్సి వస్తుందని హెచ్చరించారు. సైడ్ కాల్వల మీద కూడా వ్యాపారాలు చేయడంతో కొనుగోలుకు వచ్చే వినియోగదారుల ద్విచక్ర వాహనాలు నడీ రోడ్ పై పెడుతుండడంతో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. వ్యాపారులే వారివారి స్థలాల్లో ఉంటె ఇబ్బందులు ఉండవని అన్నారు. ఈ ట్రాఫిక్ ఇబ్బందులపై ఇప్పటికే ఎంపీడీఓ, ఎస్సై, పంచాయతీ కార్యదర్శి వచ్చి వ్యాపారులకు నోటీసులు ఇచ్చి పదిరోజులు గడిచింది.
అయినా స్పందన లేక పోవడంతో సిఐ రంగంలోకి దిగారు. ప్రతీ శనివారం వారాంతపు సంత టేకులపల్లిలో నిర్వహించడం, ఆరోజు సాయంత్రం కాగానే ట్రాఫిక్ పెరిగి వాహనాల రాకపోకలకు మరింత ఇబ్బంది ఏర్పడుతుంది. బోడు రోడ్ సెంటర్ డివైడర్ నుంచి ఇల్లందు - కొత్తగూడెం హైవే రోడ్ వరకు ఇరుపక్కల సైడ్ కాల్వ దాటి వ్యాపారాలు చేస్తే ఖఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని సిఐ హెచ్చరించారు. ముఖ్యకంగా కూరగాయల వ్యాపారాలు రోడ్డుపైకి వచ్చి కూరగాయలు పెట్టడం, కొనుగోలుకు వచ్చే వారి వాహనాలు నడీ రోడ్ పై పెడుతుండటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. సింగరేణి కోయగూడెం ఉపరితల గని నుంచి బొగ్గు తీసుకు పోయే లారీలు డివైడర్ ముగింపు వద్ద నానా యాతన పడాల్సి వస్తుంది. డివైడర్ ముగింపు వద్ద ఏర్పడ్డ పెద్ద గొయ్యి ప్రమాదభరితంగా తయారైందని స్థానికులు సిఐకి వివరించారు. సింగరేణి అధికారులకు సమాచారం ఇచ్చి గొయ్యి పూడ్చే చర్యలు చేపడతామన్నారు.