మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి సర్కిల్ పరిధిలో జరుగు గణష్ నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని పట్టణ సిఐ శశిధర్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసులు సూచించిన నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. అధిక శబ్దాలను కలిగించే డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. విగ్రహాలను నిమజ్జనానికి తీసుకువెళ్లే వాహనాలలో మద్యం మత్తులో ఉన్నవారిని అనుమతించకూడదని, మండపం నిర్వాహకులకు, ఉత్సవ కమిటీ నిర్వాహకులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు.
రెచ్చగొట్టే నినాదాలు చేయడం, మత స్థలాల దగ్గర ఊరేగింపులను నిలువ కూడదని అన్నారు. కనులపండుగగా జరుగు గణేష్ నిమజ్జన యాత్రను ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరపాలని ఎవరు కూడా ఇతర భక్తులకు కానీ సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించరాదని ఆయన తెలిపారు. ప్రతి విగ్రహం నిమర్జనం వీలైనంత త్వరగా బయలుదేరాలని, వాహనాలపై పరిమితికి మించి భక్తులు వెళ్లకూడదని తెలిపారు. ఊరేగింపు సమయంలో కరెంటు తీగలను గమనించి వాహనాన్ని నడపాలని కోరారు.