11-04-2025 08:51:00 AM
భద్రాచలం,(విజయ క్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామం నుండి భద్రాచలం పట్టణానికి ట్రిప్పర్ లో తరలిస్తున్న గ్రావెల్ కేసులో భద్రాచలం పట్టణ సీఐ బరపాటి రమేష్ కానిస్టేబుల్ రామారావు పోలీస్ మీడియేటర్ కార్తీక్ ను అరెస్టు చేసినట్లు ఏసిపి ఖమ్మం డిఎస్పి రమేష్ తెలిపారు. భద్రాచలం పట్టణానికి మార్చి 19వ తేదీన ఒక గ్రావెల్ ట్రిప్పర్ రాగానే పోలీస్ సిబ్బంది దానిని స్వాధీనం చేసుకొని ఎటువంటి అనుమతులు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు.అలాగే గ్రావెల్ యజమానిని కూడా పోలీస్ స్టేషన్ పిలిపించారు. దీంతో ఆ గ్రావెల్ యజమాని తాను ఇల్లు కట్టుకుంటున్నానని దానికోసం గ్రావెల్ తెప్పించుకుంటున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే పోలీసులు కేసు పెడతామని భయపెట్టి సిఐ గన్ మాన్ రామారావు తో బేరసారాలు ఆడారు.
కేసు పెట్ట కూడదంటే రూ 30 వేలు కావాలని రామారావు గ్రావేల్ యజమానికి చెప్పగా ఆయన అంత ఇచ్చుకోలేనని కేసి పెట్టుకోమని చెప్పారు. దీంతో సిఐ గన్ మాన్ రామారావు మరోసారి సిఐ తో మాట్లాడి ఇరవై వేల రూపాయలు ఇస్తే వదిలేస్తామని చెప్పడంతో గ్రావల్ యజమాని ఫోన్ పే ద్వారా 20 వేల రూపాయలు గన్ మాన్ మిత్రుడు కార్తీక్ పంపమని రామారావు చెప్పడంతో గ్రావెల్ యజమాని ఆ విధంగా రూ 20 వేలు రూపాయలు కార్తీక్ ఫోన్ పే పంపినట్లు డి.ఎస్.పి రమేష్ తెలిపారు. దీంతో పట్టుకున్న ఆ గ్రావెల్ లారీని ఎటువంటి కేసు లేకుండా సీఐ పంపించిఅన్ వేశారు. గురువారం ఏసీబీ పోలీసులు పెద్ద ఎత్తున భద్రాచలం వచ్చి కేసును దర్యాప్తు చేసి నిందితులైన భద్రాచల పట్టణ సీఐ బరపాటి రమేష్, కానిస్టేబుల్ రామారావు, కానిస్టేబుల్ మిత్రుడు కార్తీకులను అరెస్టు చేస్తున్నట్లు ఎ సి బి డి ఎస్ పి రమేష్ తెలిపారు. నిందితులను ఏసీబీ కోర్టు లో హాజరు పరుస్తామని వారు తెలిపారు.