ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన రెజ్లర్ అమన్ షెరావత్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా ముచ్చటించారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని అథ్లెట్ల బృందంతో మోదీ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్ నుంచి తిరిగొచ్చాకా మీకు ఇష్టమైన ఆహారం తీసుకున్నారా అని అమన్‌ను ప్రధాని ప్రశ్నించారు. దీనికి అమన్..‘నేను ఇంటికి వెళ్లలేదు సార్’ అని తెలిపాడు. మీకు ఇష్టమైన వంటకం చెప్పి ఉంటే ఇక్కడే తయారు చేయించేవాళ్లం అని మోదీ అనగా.. ఇంటికి వెళ్లి చుర్మా తింటానని అమన్ బదులిచ్చాడు. దీంతో ‘చుర్మా ఇంకా అందలేదు’ అని మోదీ అనడంతో నవ్వులు విరపూశాయి.
పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ప్రధాని అథ్లెట్లతో సంభాషించారు.ఈ సమయంలో నీరజ్ చోప్రా హర్యానా చుర్మాను తినిపిస్తామని పేర్కొన్నాడు. నీరజ్ తల్లి చేసిన చుర్మా తినాలని ఉందని ఆ రోజున మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. 11 ఏళ్లకే తల్లిదండ్రులను కోల్పోయిన అమన్ షెరావత్ పట్టుదలతో రెజ్లర్‌గా ఎదిగాడు. పారిస్ ఒలింపిక్స్‌లో భారత తరఫున రెజ్లింగ్‌లో పతకం తీసుకొచ్చిన ఏకైక రెజ్లర్‌గా అమన్ నిలిచాడు. పురుషుల 57 కేజీల విభాగంలో అమన్ సెమీస్‌లో ఓడిన అమన్ కాంస్య పతక పోరులో నెగ్గి పతకం గెలుచుకున్నాడు.