calender_icon.png 27 December, 2024 | 1:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తగని స్నేహబంధం

05-11-2024 12:00:00 AM

మన ప్రధానమంత్రికి అత్యంత సన్నిహిత మిత్రుడు,ప్రపంచ కుబేరుడు అదానీ వ్యాపార సామ్రాజ్య విస్తరణకు కెన్యా కోర్ట్ బ్రేకులు వేసింది. ఈ విషయాన్ని గత నెల 27న బ్లూంబర్గ్  బ్లాస్ట్ చేసింది. వివరాలలోకి వెళితే...ఈ నెల ప్రారంభంలో కెన్యా ఎలక్ట్రిసిటీ ట్రాన్స్‌మిషన్ కంపెనీ (కెట్రాకో)తో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ కంపెనీ కెన్యా ప్రభుత్వంతో గతంలో హైవోల్టేజ్ విద్యుత్తు లైన్ల నిర్మాణం, నిర్వహణ కోసం 30 ఏండ్లకు గానూ  ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దాని విలువ మన దేశ కరెన్సీలో సుమారు రూ.6,189 కోట్లు. ఈ వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత పాటించలేదనే కారణంతో ఈ ఒప్పందాన్ని కెన్యా కోర్ట్ సస్పెండ్ చేసింది.

దీంతో అదానీ కంపెనీకి గట్టి షాకే తగిలింది. ఇంతకు ముందు కెన్యా దేశ రాజధాని నైరోబీలోని జోమో కెన్యట్టా విమానాశ్రయాన్ని అదానీ గ్రూపునకు లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి కార్మికులు నిరసనకు దిగారు. దానితో అక్కడి ప్రభుత్వం ఆ ఒప్పందాన్ని రద్దు చేసింది. ఇప్పుడు తాజాగా ఈ విద్యుత్తు ప్రాజెక్టును కోర్టు రద్దు చేయడంతో అదానీ గ్రూప్ సంస్థల వ్యాపారానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.

ఒప్పందాలలో పారదర్శకత కరవు

అదానీ గ్రూప్ కంపెనీలు నిర్వహించే ఏ వ్యాపారంలోనూ, దేశ,విదేశాలతో కుదుర్చుకున్న ఏ ఒప్పందాలలోనూ పారదర్శకత ఉండదనీ,అన్నీ రహస్యాలు దాగి ఉంటాయని, గతంలో హిండెన్‌బర్గ్ వెల్లడించిన రిపోర్ట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి ఇదే విషయాన్ని బలపరుస్తూ కెన్యాలో ఈ ఉదంతం బయటపడింది.హైవోల్టేజ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లైన్స్ నిర్మాణ, నిర్వహణ లో ఏ ఒప్పందాలూ పారదర్శకంగా లేవని, రాజ్యాంగ నిబంధ నలు పాటించలేదని ’లా సొసైటీ ఆఫ్ కెన్యా’ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ ప్రాజెక్టుపై ముందుకెళ్లొద్దని, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌తో కొత్తగా ఎలాంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోవద్దని అక్కడి హైకోర్టు తాజాగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ ప్రాజెక్టు కెన్యా ప్రజలకు భవిష్యత్తులో పిడుగుపాటుగా మారనుందని, విద్యుత్తు చార్జీలు రెట్టింపయ్యే ప్రమాదం ఉందని అక్కడి మీడియాలో ఇప్పటికే అనేక  కథనాలు వచ్చాయి. ప్రస్తుతం యూనిట్ చార్జీ కెన్యా కరెన్సీ ప్రకారం ఎస్‌హెచ్ 5.51గా ఉండగా, ఇది రెట్టింపై ఎస్‌హెచ్ 11.14కి చేరుకుంటుందని అక్కడి విద్యుత్ రంగ నిపుణుల అంచనాలు పేర్కొన్నాయి. ఇది ప్రజలకు నిజంగా విద్యుదాఘాతమేనని, అదానీ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ ఒప్పందం కుదుర్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి.

విమానాశ్రయ ప్రాజెక్ట్ విషయంలోనూ చుక్కెదురే

నైరోబీలోని కెన్యట్టా విమానాశ్రయ ఆధునికీకరణ, 30 ఏండ్లపాటు నిర్వహణ కోసం కెన్యా ఎయిర్‌పోర్ట్స్ ఆథారిటీతో ఆదానీ సంస్థ గతంలో ఒప్పందం కుదుర్చుకున్నది. అయితే దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడి విమానాశ్రయ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు,ధర్నాలు చేపట్టారు. ఆదానీకంటే ఏఎలీజీ అనే స్థానిక సంస్థ మెరుగైన ప్రతిపాదన చేసినప్పటికీ ప్రభుత్వం ఏకపక్షంగా ఆదానీ సంస్థకు ప్రాజెక్టు కట్టబెట్టిందని విమర్శించాయి. దీంతో ఈ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దుచేసింది. టెండరు ప్రక్రియపై ప్రత్యేక ఆడిట్ జరిపే వరకు ఆదానీ సంస్థతో తదుపరి ప్రక్రియను నిలిపివేయాలని నిర్ణయించింది.

మోదీ,- అదానీ స్నేహబంధం వల్లే  చిక్కుల


అదానీ-,మోదీ మైత్రీ బంధంపై కెన్యా మాజీ ప్రధానిఒడింగా ఈ మధ్య చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రధాని మోదీ గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఆ రాష్ట్రంలో ప్రధాని హోదాలో పర్యటించినట్టు ఆయన పేర్కొన్నారు.మోదీ ఆహ్వానం మేరకే తాను,తన సిబ్బంది పర్యటించినట్టు చెప్పారు. అదానీ గ్రూప్ కంపెనీలకు చెందిన పోర్టు, పవర్ ప్లాంట్, రైల్వేలైన్, ఎయిర్‌స్క్రిప్ట్ తదితర ప్రాజెక్టులను మోదీ ప్రత్యేకంగా వివరించినట్టు తెలిపారు. దీంతో మోదానీ బంధం మరోసారి బయటపడిందని ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడ్డాయి.

గతంలో శ్రీలంకలోనూ ఇదే తంతు 

శ్రీలంకలో 500 మెగావాట్ల విండ్ పవన విద్యుత్ (విండ్‌పవర్) ప్రాజెక్టును ఎలాంటి పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు రహస్యంగా కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అదానీ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకు మన ప్రధానమంత్రి మోదీ అప్పటి శ్రీలంక అధ్య క్షుడు రాజపక్సపై ఒత్తిడి తెచ్చినట్టు ఆ దేశ విద్యుత్తు సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన ఫెర్డినాండో 2022లో బయటపెట్టిన విషయం అంతర్జాతీయంగా మీడియాలో దుమారం లేపింది.ఈ  ఒప్పందంలో కూడా పోటీ లేకపోవడంతో అదానీ గ్రూప్‌నకు 25 ఏండ్లలో 4 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆయాచిత లాభం చేకూరుతుందని శ్రీలంక ఇంజినీర్లు తేల్చి చెప్పారు.

దీంతో గత ప్రభుత్వ పెద్దలతో ఆదానీ గ్రూప్ లోపాయికారీ ఒప్పందాలపై పునస్సమీక్షించనున్నట్టు శ్రీలంక కొత్త ప్రభుత్వం ప్రకటించిన విషయం తెల్సిందే. ఇలా ప్రధాన మంత్రి తన పదవిని, హోదాను దుర్వినియోగం చేస్తూ... ఒక మిత్రుని వ్యాపారాలలో లాభాల కోసం ప్రాకులాడటం ..ఇతర దేశాల్లో వ్యాపార ఒప్పందాలకు సహకరించటం ఎంతవరకు సమంజసం? ...మన దేశ ప్రతిష్ఠకు అవమానకరం కాదా!.ఇతర వ్యాపార వర్గాలకు ఉద్దేశ్యపూర్వకంగా నష్టం చేకూర్చటం  కాదా! వ్యాపారంలో పోటీ సహజం.

దేశంలోని అన్ని వర్గాలను సమానంగా చూడవలసిన బాధ్యతగల ప్రధాని తన మిత్రుడైనందుకు పక్షపాతంతో వ్యవహరించటం తగునా! ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? విజ్ఞులు,విపక్షాలు ఆలోచించాలి.