calender_icon.png 28 November, 2024 | 6:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

95 నియోజకవర్గాల్లో అధికారికంగా క్రిస్మస్

28-11-2024 03:27:31 AM

  1. ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకలకు సీఎం హాజరు
  2. సెలబ్రేషన్ కమిటీ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా 95 నియోజకవర్గాల్లో ప్రభుత్వం అధికారికంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించనున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ౨౦౦ ప్రాంతాల్లో వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. ఇందుకోసం ఏర్పా ట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

క్రిస్మస్ వేడుకల నిర్వహణపై బుధవారం ప్రజాభవన్‌లో సెలెబ్రేషన్ కమిటీ సభ్యులు, ఉన్నత అధికారులతో భట్టి సమీక్షించారు. అనంతరం ఎల్బీ స్టేడియంలో జరిగిన క్రైస్తవ ప్రతినిధుల సభలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా కమిటీలు వేయాలని సూచించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.

సీఎం హాజరయ్యే ఈ వేడుకలకు రాష్ర్టంలోని అన్ని చర్చీల ఫాదర్లను ఆహ్వానించాలని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్‌కు సూచించారు. వేడుకల సందర్భంగా సోషల్ వర్క్, మెడికల్, ఎడ్యుకేషన్, లిట్రసీ, స్పోర్ట్స్, ఫైన్ ఆర్ట్స్ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగాఅవార్డు, రివార్డులను అందజేయనున్నట్టు చెప్పారు.

అవార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన పత్రికల్లో నోటిఫికేషన్ వేయాలని క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సబితను ఆదేశించారు. సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి తఫ్సీర్, జీఏడీ డైరెక్టర్ ఎస్ వెంకట్రావు, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాంతి వెస్లీ తదితరులు  పాల్గొన్నారు.

వివిధ రంగాల్లో సేవలందించిన క్రైస్తవులకు సత్కారం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(విజయక్రాంతి) : వివిధ రంగాల్లో సేవలందించిన క్రైస్తవులకు, క్రైస్తవ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే వేడుకల్లో సత్కారించ బోతున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఇలియాస్ అహ్మద్ తెలిపారు. పదేండ్లకు పైబడి సామాజిక సేవ, విద్యా బోధన, సాహిత్యం, క్రీడారంగాల్లో సేవలందించిన వారు డిసెంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.