28-03-2025 11:03:07 PM
వైరాలో కొవ్వొత్తులతో క్రైస్తవుల శాంతి ర్యాలి
వైరా,(విజయక్రాంతి): గత నాలుగు రోజులు క్రితం మరణించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం పై నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తూ వైరాలో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో శుక్రవారం శాంతి ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. వైరా మండలంకు చెందిన క్రైస్తవ పాస్టర్లు విశ్వాసులు క్రైస్తవ అభిమానులు ఐక్య క్రైస్తవులు ఆధ్వర్యంలో 300కు పైగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొన్నారు. భారతదేశంలో గొప్ప పాస్టర్ గా పేరుందిన పగడాల ప్రవీణ్ మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసు వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. హిందూ ముస్లిం క్రైస్తవుల ఐక్యత వర్ధిల్లాలని, హోరెత్తిన నినాదాలు చేశారు. పోస్టుమార్టం రిపోర్టును ఉన్నదున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రేమ కరుణ మానవత్వం మంచితత్వం మార్గాలను చూపించే క్రైస్తవ్యంపై విషం చిమ్మటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వైరా రింగ్ రోడ్ సెంటర్ నుండి ప్రారంభమైన ఈ శాంతి ర్యాలీ పాత సెంటర్ మీదుగా క్రైస్తవులు ప్రదర్శన నిర్వహించారు. పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం క్రైస్తవులైన మాకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు ఫెలోషిప్ నాయకులు పాస్టర్లు విశ్వాసులు పాల్గొన్నారు.