calender_icon.png 25 October, 2024 | 5:54 AM

చోటేమియా.. బడా మోసం!

06-08-2024 04:26:20 AM

  1. అధిక మిత్తి ఆశచూపి రూ.30 కోట్లకు పైగా లూటీ
  2. కందనూలులో మరో చిట్టీల మోసగాడి బాగోతం
  3. పరారీలో నిందితుడు 
  4. లబోదిబోమంటున్న 200మందికిపైగా బాధితులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 5 (విజయక్రాంతి): సాయిరాం ఫైనాన్స్ పేరుతో నాగర్‌కర్నూల్ జిల్లాలో సాయిబాబా రూ.50కోట్లకు పైగా లూటీ చేసిన ఘటన మరువకముందే ఇదే జిల్లాలో మరో చిట్టీల వ్యాపారి మోసా లు బయటపడ్డాయి. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో తనను నమ్మిన కుటుంబ సభ్యులు, బంధువులను నట్టేటా ముంచి, ఉడాయించాడు. 200మందికి పైగా బాధితులు లబో దిబోమంటూ సోమవారం పోలీసులను ఆశ్రయించారు. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన జహీర్ అలియాస్ చోటామియా(36) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్‌తో పాటు చిట్టీల వ్యాపారం చేస్తున్నాడు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న దుర్బుద్ధితో తన తోడి అల్లుడు, కుటుంబ సభ్యులు, బంధువులతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించాడు. వారి పెట్టుబడులకు మొదట్లో ఠంచన్‌గా ఎక్కువ మిత్తి డబ్బులను చెల్లిస్తూ మరింత నమ్మకాన్ని కల్పించాడు. దీంతో తమ బంధువులు, స్నేహితులు, వారికి తెలిసిన వారు ఆరోగ్యం కోసం, తమ పల్లిల చదువులు, పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బుతో పాటు బంగారం తాకట్టు పెట్టి మరీ డబ్బులను ముట్టజెప్పారు. అందుకు కొందరికి బాండ్‌పేపర్లు, ఇతర పత్రాలను రాయించి ఇచ్చా డు. ఇలా తెలకపల్లి మండలంలోని నడిగడ్డ, తెలకపల్లి, అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తూడుకుర్తి వంటి ప్రాంతాలకు చెందిన సుమారు 200మంది నుంచి రూ.30కోట్లకు పైగా వసూలు చేశాడు.

ఏళ్లు గడిచినా డబ్బు ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో నిందితుడు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో జిల్లా కేంద్రానికి చెందిన ఓ పత్రికా జర్నలిస్టు వద్ద బాధితులు తమ గోడును వెల్లబోసుకున్నా రు. జర్నలిస్టు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ కొందరికి డబ్బులు ఇప్పించాడు. సోమవా రం మరికొందరికి ఇప్పించాల్సి ఉండగా తనను ఎవరో కిడ్నాప్ చేశారంటూ నిందితు డి ఫోన్ నుంచి అతడి భార్య ఫోన్‌కి మెసేజ్ వచ్చింది. దీంతో ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. బాధితులంతా ఎస్పీ గైక్వార్డ్ వైభవ్ రఘునాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. కిడ్నాప్ అంటూ కొత్త డ్రామా ఆడుతున్నాడని, నిందితుడిని పట్టుకుని డబ్బులు ఇప్పించాలని కోరారు. నిందితుడిని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని ఆరోపించారు.