యువతకు పిఓ రాహుల్ పిలుపు...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): నిరుద్యోగులైన గిరిజన యువతి యువకులు తేనెటీగల పెంపకం కుటీర పరిశ్రమలుగా నెలకొల్పుకొని జీవనాధారం పెంపొందించుకోవడానికి ఆసక్తి ఉంటే తప్పనిసరిగా ఐటీడీఏ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం తేనెటీగల పెంపకం గురించి మెలకువలు తెలుసుకోవడానికి రీసెర్చ్ సెంటర్కు వెళ్లి వచ్చిన గిరిజన యువతి యువకులను తన చాంబర్లో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృషి విజ్ఞాన కేంద్రం, వై టి సి ద్వారా తేనెటీగల పెంపకం గురించి మూడు రోజుల శిక్షణ తీసుకున్న గిరిజన యువతీ యువకులకు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ శివ తెలియజేసిన మెలకువలు పూర్తిస్థాయిలో అర్థం చేసుకొని, అగ్రికల్చర్ రీసెర్చ్ విజయరామ్ ఏలూరు జిల్లాలో ఉన్న సెంటర్ను సందర్శించారు.
తేనెటీగల పెంపకం యొక్క ప్రాముఖ్యత గురించి, తేనెను ఎలా సేకరించాలో సైంటిస్టుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పూర్తిస్థాయిలో అవగాహన చేసుకున్న గిరిజన యువతి యువకులు సొంతంగా తేనెను సేకరించి మార్కెటింగ్ చేసుకుంటే పి ఎం ఈ జి బి ద్వారా తేనెటీగల పెంపకం యూనిట్ ఇప్పించడానికి కృషి చేస్తానన్నారు. గిరిజనులు సేకరించే తేనెకు మార్కెట్లో మంచి ఆదరణ ఉందని, అందుకు గిరిజన యువతి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తేనెటీగల పెంపకం జరుపుకుంటే సేకరించిన తేనెను ఐటీడీఏ కార్యాలయంలో, ఐటీడీఏ ప్రాంగణంలోని మ్యూజియంలో అమ్మకాలు జరుపుకోవడానికి అనుమతులు ఇస్తానన్నారు.
తేనెటీగల పెంపకం కుటీర పరిశ్రమ నెలకొల్పుకున్నవారికి లైసెన్సులు ఇప్పించడమే గాక తేనెటీగలు పెంచుకోవడానికి ప్రతి యూనిట్ సభ్యులకు ఐదు బాక్సుల చొప్పున అందించి సేకరించిన తేనెను మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తానని, దీనిని గిరిజన యువతీ యువకులు సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఉద్యానవనాధికారి ఉదయ్ కుమార్, జేడీఎం హరికృష్ణ, హార్టికల్చర్ సైంటిస్ట్ లక్ష్మీనారాయణమ్మ, ఆర్గానిక్ కోఆర్డినేటర్ శివ, 21 మంది గిరిజన యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.