26-03-2025 01:03:27 AM
హైదరాబాద్‌సిటీ బ్యూరో, మార్చి 25 (విజయక్రాంతి): నగరంలో చిట్టీల పేరిట దాదాపు రూ. 100 కోట్లు వసూలు చేసి పరారైన పుల్లయ్య అనే వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు అతడి కుమారుడు రామాంజనేయు లు బెంగళూరులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తరలించారు.
ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపే అవకాశముందని తెలుస్తోంది. పోలీసులు కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
అధిక వడ్డీ ఆశచూపి..
ఏపీలోని అనంతపురానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి 20ఏండ్ల కింద నగరానికి ఉపాధి కోసం వచ్చాడు. తాపీమేస్త్రీగా పనిచేస్తూ ఎస్సార్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బీకేగూడ రవీంద్రనగర్ కాలనీలో చిన్న ఇంటిలో అద్దెకు ఉండేవాడు.ఆ తర్వాత చిట్టీలు నడుపడం ప్రారంభించాడు. మొదట్లో రూ. 5 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు చిట్టీలు నడిపేవాడు.
చిట్టీ ముగిసిన వారి నుంచి డబ్బులను వడ్డీకి తీసుకుని, ఎక్కువ వడ్డీ ఇస్తానని ఆశ చూపి ఆ డబ్బులను కూడా తన వద్దే ఉంచుకునేవాడు. కొద్దికాలంలోనే అదే ఏరియాలో పెద్ద బిల్డింగ్ కట్టాడు. ఈ క్రమంలో గత ఫిబ్రవరి 25న చిట్టీలు వేసిన వారికి డబ్బులు ఇస్తామని చెప్పి ఆ రోజు నుంచి పుల్లయ్య, అతడి కుటుంబసభ్యులు కనిపించకుండాపోయారు.
నగరానికి చెందిన దాదాపు 1,500 మంది పుల్లయ్య దగ్గర చిట్టీలు వేశారు. పుల్లయ్య చెప్పిన సమయానికి అతడి ఇంటికి వచ్చిన బాధితులు తాళం వేసి ఉండడంతో లబోదిబోమన్నారు. అనంతరం నాలుగైదు రోజుల పాటు అతడి ఇంటి వద్దకు వచ్చిన బాధితులు తీవ్ర ఆవేదన చెందారు.
అనంతరం బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించగా, విచారణ జరిపిన పోలీసులు పుల్లయ్య, అతడి కుమారుడు రామాంజనేయులును బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. కాగా నగరంలో వసూలు చేసిన డబ్బులతో బెంగుళూరులోని పలువురు బిల్డర్లకు పుల్లయ్య పెట్టుబడి రూపంలో డబ్బులు ఇచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.