హనుమకొండ, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : చిట్టీ డబ్బులను డిపాజిట్లుగా మార్చుకుని డిపాజిట్ దారులకు చెల్లించకుండా మోసం చేసిన శ్రీఅక్షయదర్శిని చిట్‌ఫండ్ డైరెక్టర్ రంజన్‌రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు సుబేదారి సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు. హనుమకొండకు చెందిన రంజన్‌రెడ్డి శ్రీ అక్షయదర్శిని చిట్‌ఫండ్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. ఆ కంపెనీలో 25 నుంచి 50 మంది చొప్పున సభ్యులను గ్రూపుగా ఏర్పాటు చేసుకుని చిట్టీలు నడుపుతున్నాడు. ఈ మేరకు 2018లో బక్కి దిగంబరావు అనే వ్యక్తి తన పేరిట రూ.15 ల క్షలు, భార్య పేరిట రూ.25 లక్షలు చిట్టీలు వేశాడు.
చిట్టీ పూర్తయిన తర్వాత రూ.50 లక్ష లు ఇవ్వాల్సి ఉండగా దిగంబరావుకు కేవల ం రూ.20 లక్షలు మాత్రమే ఇచ్చి మిగతా రూ.30 లక్షలు కంపెనీలో డిపాజిట్ చేయాలని 18 శాతం వడ్డీతో ప్రతినెలా వాయిదా రూపంలో చెల్లిస్తానని రంజన్‌రెడ్డి నమ్మబలికాడు. నిజమని నమ్మిన ఆ దంపతులు రూ. 30 లక్షలు డిపాజిట్ చేశారు.
తర్వాత రంజన్‌రెడ్డి సగం డబ్బులు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వకుండా కాలయాపన చేశాడు. ఈ మేరకు బాధితుడు సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్సై శ్రీకాంత్ బాధితుడి ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి నిందితుడు రంజన్ రెడ్డిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.