రూ.కోట్లలో చీటి డబ్బుల వసూలు
వాయిదాలు పూర్తయినా చెల్లించని సంస్థ
బాధితుల ఆందోళన
ఖమ్మం, డిసెంబర్ 22 (విజయక్రాంతి): ఖమ్మం నగరంలో అక్షర చిట్‌ఫండ్ సంస్థ భారీ మోసానికి పాల్పడటంతో వందలాది మంది బాధితులు లబోదిబోమంటూ ఆదివారం ఖమ్మంలోని బైపాస్ రోడ్డు కొత్త బస్టాండ్ సమీపంలోని సంస్థ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. సిబ్బందితో గొడవకు దిగడంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. తాము కట్టిన కోట్లాది రూపాయల చీటి డబ్బును తిరిగి చెల్లించాలని బాధితులు డిమాండ్ చేశారు.
సంస్థ చైర్మన్‌ను అడ్డుకుని, తమ సొమ్ము కోసం నిలదీశారు. చీటిలు కట్టి, వాయిదాలు పూర్తయినా డబ్బులు చెల్లించకుండా ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని దాదాపు 200 మంది బాధితులు ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్ష వరకు కట్టిన వారికి డబ్బులు చెల్లించేందుకు చైర్మన్ చిట్‌ఫండ్ ఆఫీస్‌కు వచ్చారు.
అయితే కట్టిన చిట్టీ డబ్బు కంటే తక్కువ ఇవ్వడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు తక్కువ డబ్బు ఇవ్వడమే కాకుండా తమ వద్ద ఉన్న చెక్కులను కూడా తీసుకుని, సంతకాలు తీసుకుం టున్నారని, ఇలా ఎందుకు చేస్తున్నారని అడితే చెప్పడం లేదని బాధితులు వాపోయారు.