04-03-2025 07:28:49 PM
కొత్త మేనేజ్మెంట్ ఆంక్షలు..
టోల్ ఫీజ్ కట్టాల్సిందేనంటున్న యజమాన్యం..
టోల్ ప్లాజా యజమాన్యం తీరుపై స్థానికుల అగ్రహం..
ఆందోళన చేపట్టిన స్థానిక గ్రామాల ప్రజలు, రైతులు..
10 సంవత్సరాలుగా లేని ఆంక్షలు ఇప్పుడు ఎందుకు అని ప్రశ్నిస్తున్న గ్రామస్తులు..
కామారెడ్డి (విజయక్రాంతి): టోల్ ప్లాజా నిర్వహణకు కొత్త యజమాన్యం రావడంతో టోల్ ప్లాజాలో పనిచేసే సిబ్బంది వేతనాల విషయంలో వేతనాలు తగ్గిస్తామని స్థానికుల వాహనాలకు టోల్ ఫీజు వసూల్ చేస్తామని చెప్పడంతో కామారెడ్డి జిల్లా బిక్కనూరు టోల్ ప్లాజా రోజుకు కిరికిరి నడుస్తుంది. గత పది సంవత్సరాలుగా స్థానికుల వాహనాలకు టోల్ ఫీజు వసూల్ చేయని సిబ్బంది కొత్త యాజమాన్యం వచ్చిన నుంచి టోల్ ఫీజు చెల్లించాలని కోరడంతో స్థానిక గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టోల్ ప్లాజాలో పని చేస్తున్న సిబ్బందికి వేతనాలు తగ్గిస్తామని లేకుంటే విధుల నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పడంతో సిబ్బంది గత కొద్ది రోజులుగా నిరసన దీక్షలకు దిగిన విషయం విధితమే. దీంతో నూతన యజమాన్యం దిగివచ్చి పాత సిబ్బందినీ నియమించుకుంటామని స్కిల్స్ లేనివారికి వేతనాలు తగ్గిస్తామని చెప్పారు.
ప్రస్తుతం స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజల వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాల్సిందేనని చెప్పడంతో ఇప్పటికే రెండుసార్లు యజమాన్యం వైఖరిని నిరసిస్తూ ఆయా గ్రామాల ప్రజలు టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగారు. వ్యవసాయ భూము లు ఉండడం వల్ల ప్రతిరోజు మూడు నాలుగు సార్లు కారు ట్రాక్టర్లు వాహనాలకు టోల్ వసూలు చేస్తే ఊరుకునేది లేదని కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలంలోని రామేశ్వర్ పల్లి తిప్పాపూర్ పెద్ద మల్లారెడ్డి బిక్కనూర్ లక్ష్మీదేవి పల్లి అంతంపల్లి మొటాటుపల్లి ర్యాగట్లపల్లి గ్రామస్తుల ప్రజలు మంగళవారం టోల్ ప్లాజా వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. దీంతో రాకపోకలకు అరగంట పాటు అంతరాయం ఏర్పడింది. టోల్ ప్లాజా మేనేజర్ ప్రకాష్, సిబ్బంది వారిని శాంతించాలని తప్పకుండా సమస్యను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.
మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ పంట పొలాలు టోల్ ప్లాజా చుట్టుపక్కల ఉన్నాయని ప్రతిరోజు వ్యవసాయ పనుల నిమిత్తం వాహనాల ద్వారా టోల్ ప్లాజా నుండి రాకపోకలు సాగిస్తుంటామని, టోల్ ప్లాజా ఏర్పడిన 15 సంవత్సరాల నుండి ఎలాంటి టోల్ ఫీజు వసూలు చేయలేదని, కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ తమ వాహనాల ఫోటోలు తీస్తూ టోల్ ఫీజు వసూలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 15 రోజుల నుండి టోల్ వసూలు చేయొద్దని మేనేజర్ కు వినతి పత్రం అందజేశామని అయినా కూడా టోల్ వసూలు చేయడం ఏంటని గ్రామస్తులు వారిపై ఫైరయ్యారు. ఇకనైనా టోల్ తగలకుండా తమ వాహనాలను అనుమతించాలని లేనియెడల తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టోల్ ప్లాజా యజమాన్యాన్ని హెచ్చరించారు. టోల్ ప్లాజా యాజమాన్యం చేస్తున్న కిరికిరి రోజురోజుకు పెరుగుతుంది. ఇలాగే వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. హామీ ఇస్తున్నారు తప్ప అమలు చేయడం లేదని గ్రామస్తులు విజయ క్రాంతి తో తెలిపారు.