13-04-2025 12:18:11 AM
మెగాస్టార్ చిరంజీవి నుంచి వస్తున్న తాజాచిత్రం ‘విశ్వంభర’. వశిష్ట దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిషకృష్ణన్, ఆశికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో కునాల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పాన్‌ఇండియా సినిమాకు సంబంధించి ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ అంచనాలను నెలకొల్పాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఓ భక్తిపాటను విడుదల చేయడం ద్వారా మేకర్స్ మ్యూజిక్ ప్రమోషన్స్‌కు తెరతీశారు. హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా శనివారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రామ రామ’ ను విడుదల చేశారు.
‘తయ్యతక్క తక్కధిమి చెక్కా భజనాలాడి రాములోరి గొప్ప చెప్పుకుందామా.. ఆ సాములోరి పక్కనున్న సీతామాలచ్చుమమ్మ లక్షణాలు ముచ్చటించుకుందామా.. నీ గొంతు కలిపీ మా వంత పాడగ రావయ్య అంజని హనుమా.. రామయ్య కీర్తన నోరార పలుకగ చిరంజీవి నీ జనుమా..’ అంటూ సాగుతున్న ఈ పాట సంగీత ప్రియులను ఆద్యంతం భక్తిసాగరంలో ఓలలాడింపజేస్తోంది. ఎంఎం కీరవాణి స్వరపర్చిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించగా.. శంకర్ మహాదేవన్, లిప్సిక ఆలపించారు. ఈ చిత్రానికి డీవోపీ: చోటా కే నాయుడు; ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాశ్.