calender_icon.png 23 September, 2024 | 2:45 AM

చిరంజీవికి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్‌లో చోటు

23-09-2024 12:40:50 AM

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భారతీయ సినీ ప్రపంచమంతటినీ ఉర్రూతలూగించారు. అలా డ్యాన్సు కు ‘చిరు’నామాగా మారిన ఆయన చిరునామాను వెతుక్కుంటూ వచ్చిన అవార్డులెన్నో! చిరు కీర్తి కిరీటంలో మరో కలికి తురాయి చేరింది.  156 సినిమాల్లో 537 పాటల్లో 24000 స్టెప్పులు వేసినందుకు గానూ మెగాస్టార్‌కు గిన్నిస్ బుక్‌లో చోటు దక్కింది. సినిమాల్లో ఎక్కువగా డాన్సు వేసిన భారతీయ నటుడిగా గుర్తిస్తూ చిరంజీవికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పురస్కారాన్ని ప్రకటించగా, ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్, చిరంజీవికి హైదరాబాద్‌లో ఆదివారం అందించారు.

అవార్డు స్వీకరించిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. ‘గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కడమనేది నేనెప్పుడూ ఊహించని గౌరవం. ముందు నేను డ్యాన్సుకే శ్రీకారం చుట్టాను. నటన కంటే డ్యాన్సుపై నాకున్న ఇష్టమే ఈ అవార్డు తెచ్చింది. డ్యాన్సు అనేది నాకు ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్. కొరియోగ్రాఫర్స్ వల్ల కూడా నా డ్యాన్సులకు క్రేజ్ వచ్చింది. డ్యాన్సుకు అవార్డు వచ్చినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు రాఘవేందర్‌రావు, బి.గోపాల్, పలువురు మెగా హీరోలు, కుటుంబ సభ్యులు హాజర య్యారు. చిరంజీవికి ఈ గౌరవం దక్కటంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవికి గిన్నిస్ బుక్ రికార్డ్‌లో చోటు దక్కడం తెలుగు వారు గర్వించదగ్గ విషయమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకా రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు చిరంజీవికి అభినందనలు తెలిపారు.