- బీజేపీ నుంచి పెద్దలసభకు వెళ్లే చాన్స్
- తెలుగు రాష్ట్రాల్లో పార్టీకి ఊపుకోసం కమలదళం ప్లాన్
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సన్నిహితంగా మెగాస్టార్
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన త్వరలోనే కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమవుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే పలుమార్లు ఢిల్లీస్థాయిలో చర్చలు పూర్తయ్యా యని దేశరాజధానిలో పుకార్లు షికారు చేస్తున్నాయి. చిరంజీవిని రాజకీయంగా తిరిగి యాక్టివ్ చేసేందుకు ఆయన సోదరుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ కూడా వ్యక్తిగతంగా చిరంజీవి తమ పార్టీలోకి రావాలని కోరుకుంటున్నా రని చర్చ జరుగుతోంది.
అందుకే ఇటీవల చిరంజీవితో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి పలుమార్లు భేటీ అయ్యారని, దీన్ని తమ స్నేహంగా కిషన్‌రెడ్డి చెప్పినా అందులో రాజకీయ కోణమూ ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చిరంజీవికి రాజ్యసభ సభ్యున్ని చేసి, ఏదైనా కీలకమైన పదవి కట్టబెడితే వచ్చే ఎన్నికల్లో ఏపీతో పాటు తెలంగాణలో పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.
గతంలో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయంగా అరంగేట్రం చేసిన చిరంజీవి.. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి, కేంద్రమంత్రి పదవిని చేపట్టారు. అనంతరం కాంగ్రెస్ ఓటమితో రాజకీయాలకు దూరమై సినిమాలపై దృష్టి సారించారు. బీజేపీలో చేరేందుకు, రాజకీయంగా తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు మొదట్లో చిరంజీవి తటపటాయించినా బీజేపీ నేతలు, పవన్ కల్యాణ్ ఆయన్ను ఒప్పించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఏపీలో పవన్ కల్యాణ్ ద్వారా రాబోయే ఎన్నికల నాటికి మరిం త బలంగా తయారయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని.. ఇప్పుడు చిరంజీవిని కూడా బీజేపీలోకి తెస్తే అటు జనసేన, ఇటు బీజేపీ కలిసి రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అవకాశం ఉందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. మరోవైపు చిరంజీవి వల్ల తెలంగాణలోనూ పార్టీకి మరింత ఊపు వస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు సైతం ఆ పార్టీ అధిష్ఠానం వద్ద చెప్పినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్‌కు ప్రయార్టీ ఇస్తున్న మోదీ టీం
చిరంజీవికి బీజేపీ నాయకత్వం, ప్రధాని మోదీ టీమ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని చర్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ అధికారిక నివాసంలో సంక్రాంతి వేడుకలకు చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీని కిషన్‌రెడ్డితో పాటు.. మెగాస్టార్ చిరంజీవి దగ్గరుండి ఆహ్వానం పలికారు.
ఈ వేడుకల్లో ప్రధానితో చిరు మాట్లాడుతున్నా దృశ్యాలు వైరలయ్యాయి. మోదీతో చిరంజీవి రాజకీయ అరంగేట్రంపైనే చర్చ జరిగిందని పుకా ర్లు వినిపించాయి. ఏపీలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్స వం రోజున చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో మోదీ సన్నిహితంగా మెలిగారు.
అప్పుడే చిరంజీవికి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందనే ప్రచారం సాగింది. ఇప్పుడయితే ఏకంగా చిరంజీవి ఢిల్లీకి వెళ్లడం.. ప్రధానిని కలవడంతో.. పార్టీలో చేరికపై ఫుల్ క్లారిటీ వచ్చేసినట్టేనని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది.