వనపర్తి, జనవరి 22 : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అమర చింత హెల్త్ సబ్ సెంటర్ ను అప్గ్రేడ్ చేసి అన్ని వసతులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు.
బుధవారం మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పర్యటన సందర్భంగా సాయంత్రం వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలంలో పర్యటించి దేశాయి మురళీధర్ రెడ్డి స్మారకార్థం వారి కుమారుడు ప్రకాష్ రెడ్డి నిర్మించిన భవనంలో నడుస్తున్న హెల్త్ సబ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్థానిక శాసన సభ్యులు వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసన సభ్యులు జి. మధుసూదన్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.
ఆసుపత్రి గదులను పరిశీలించిన మంత్రి భవనాన్ని నిర్మించి ఇచ్చిన ప్రకాష్ రెడ్డిని కొనియాడారు. తన పుట్టిన నేల కోసం ఏదో ఒకటి చేయాలి, పుట్టిన ఊరు రుణం తీర్చిలుకోవాలి అనే సంకల్పంతో చక్కని భవనాన్ని నిర్మించి ప్రభుత్వ వైద్యశాలకు ఇచ్చినందుకు ప్రకాశ్ రెడ్డిని మంత్రి కొనియాడారు.
స్థానిక శాసనసభ్యులు వాకిటి శ్రీహరి కోరిక మేరకు, మండల ప్రజలు ఎన్నో రోజులుగా మండలంలో మెరుగైన వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలి అనే కోరికను ఈ సందర్భంగా మంత్రి తీర్చారు. ఇక్కడి సబ్ సెంటరును.
వేరే ప్రాంతానికి బదిలీ చేసి ఇదే భవనంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నడిపేందుకు ఉత్తర్వులు జారి చేస్తానని హామి ఇచ్చారు. అనంతరం టి.బి. రోగులకు న్యూట్రిషన్ కిట్లను అందజేశారు. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.