calender_icon.png 14 January, 2025 | 6:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చైనా మాంజా అత్యంత ప్రమాదకరం

14-01-2025 01:42:32 AM

గజ్వేల్ రేంజ్ అటవీ అధికారి వినాయక్ 

 గజ్వేల్, జనవరి13: సంక్రాంతి సంబరాల్లో  చైనా మాంజా వినియోగంతో వన్యప్రాణులు, యువత, చిన్నారులు మృత్యువాత పడుతున్నట్లు గజ్వేల్ రేంజ్ అటవీ అధికారి వినాయక్, సెక్షన్ అధికారి పవన్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడంతో గజ్వేల్ పట్టణంతోపాటు నియోజకవర్గ పరిధిలోని దుకాణాల్లో చైనా మాంజా విక్రయం అరికట్టేందుకు ఆకస్మిక దాడులు చేపట్టి పలు దుకాణాల్లోని చైనా మాంజాను స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాల్లో పతంగులు ఎగరవేయడం ప్రతి ఒక్కరికి ఇష్టం, అయితే గాజుపొడి, సింథటిక్, నైలాన్ తదితర పదార్థాలతో తయారుచేసే పదునైన చైనా మాంజా పక్షులు, మానవులు, పర్యావరణానికి చేటు చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. చైనాలో తయారుచేసి అక్రమంగా దేశంలోకి పంపించి విక్రయిస్తున్న మాంజా ప్రమాదకరమని తెలిసినప్పటికీ కొందరు గుట్టు చాటుగా విక్రయిస్తూ ప్రాణాలు పోవడానికి కారణంగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు. 

చైనా మాంజా వినియోగాన్ని నిషేధించడంతో అక్రమంగా విక్రయిస్తే చట్ట ప్రకారం జైలు శిక్ష, జరిమానా తప్పదని హెచ్చరించారు. పండగపూట విషాదానికి కారణమైతున్న చైనా మాంజా విక్రయ దారులు, వినియోగదారులపై వన్యప్రాణుల సంరక్షణ చట్టం కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు. విక్రయించిన, వినియోగించిన వారి పై చర్యలు తప్పవని వివరించారు. కార్యక్రమంలో గజ్వేల్ సెక్షన్ ఆఫీసర్ పవన్,  వర్గల్ అర్జున్, ఇతర అటవీశాఖ  సిబ్బంది పాల్గొన్నారు.