భారత్‌కు స్నేహహస్తం అందించడానికి సిద్ధంగా ఉన్నామని అంటూనే మరో పక్క చైనా మన దేశంతో ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంది. తాజాగా టిబెట్‌లో భారత్‌చైనా సరిహద్దుకు సమీపంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి చైనా ఆమోదం తెలిపినట్లు అక్కడి మీడియాలో వస్తున్న కథనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. టిబెట్ తూర్పు భాగంలో యార్లంగ్ జంగ్బో నది దిగువ భాగంలో ఈ జలాశయాన్ని నిర్మించనున్నట్లు అక్కడి మీడియాలో కథనాలు వచ్చాయి.
ఈప్రాజెక్టు విద్యుత్ సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్ అవర్స్‌గా అంచనా. ప్రస్తుతం చైనాలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్దదైన త్రీగోర్జెస్ డ్యామ్ సామర్థ్యం 88.2 బిలియన్ కిలోవాట్ అవర్స్. అంటే కొత్త జలాశయం సామర్థ్యం దానికి మూడు రెట్లకన్నాఎక్కువ. భారత్‌లో ఈ నదిని బ్రహ్మపుత్రగా పిలుస్తారు. టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్‌గుండా బంగ్లాదేశ్‌లోకి ప్రవహిస్తుంది. మన దేశంలోని ఈశాన్యరాష్ట్రాలకు ఇది వరదాయిని. అయితే బ్రహ్మపుత్రకు వర్షాకాలంలో విపరీతంగా వరదలు వస్తుంటాయి.
ముఖ్యంగా అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాలతో పాటుగా బంగ్లాదేశ్‌లో అపార నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. 2002లో ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఏటా మే 15నుంచి అక్టోబర్ 15 వరకు బ్రహ్మపుత్ర నీటికి సంబంధించిన వివరాలను ముఖ్యంగా వరదలొచ్చే అవకాశం ఉన్నప్పుడు చైనా మన దేశానికి తెలియజేయాలి. అయితే ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత చైనా ఈ సమాచారాన్ని భారత్‌కు సరిగా ఇవ్వడం లేదు. ఈ ఒప్పందం గడువు 2023లో ముగిసింది.
కానీ డోక్లాం ప్రాంతంలో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కొత్త ఒప్పందం జరగలేదు. ఈ తరుణంలో చైనా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధమవుతుండడం కలవరపెడుతోంది. కాగా తాజాగా సరిహద్దు సమస్యపై ఈ నెల 18న ఇరుదేశాల ప్రత్యేక ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో నదుల నీటికి సంబంధించిన సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అంశం ప్రస్తావనకు వచ్చింది. భారత్ తరఫున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఇంజనీర్లకు అతిపెద్ద సవాలుగా మారుతుందని కూడా నిపుణులు అంటున్నారు. ఎందుకంటే టిబెట్‌లో తరచూ భూకంపాలు సంభవించే ప్రాంతంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. పర్యావరణ పరంగా కూడా ఇది పెద్ద ముప్పుగా మారే ప్రమాదం ఉందని వారంటున్నారు. అయితే చైనా ప్రభుత్వం మాత్రం ఈ భయాలను కొట్టిపడేస్తోంది. త్రీగోర్జెస్ ప్రాజెక్టు నిర్మాణం సమయంలో కూడా ఇలాంటి ఆందోళనలే రాగా డ్రాగన్ ప్రభుత్వం వాటిని బేఖాతరు చేసి నిర్మాణం పూర్తి చేసింది. తాజాగా నిర్మించే ప్రాజెక్టుకు 137 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చవుతుందని అంచనా.
ఒక వేళ చైనా ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తే భారత్‌కు పక్కలో బల్లెంగా మారే ప్రమాదం ఉంది. ఎండాకాలంలో నదిలో నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఏర్పడుతుంది. దీంతో అసోం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలు నీటి ఎద్దడిని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అలాగే వర్షాకాలంలో బ్రహ్మపుత్ర నదికి వరద భారీగా ఉంటుంది. ఒకేసారి పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
అంతేకాదు ఈ ప్రాజెక్టు భారత్‌చైనా సరిహద్దుకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే నిర్మిస్తున్నారు. అందువల్ల భద్రతాపరంగా కూడా భారత్‌కు సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఒక వేళ రెండు దేశాల మధ్యయుద్ధమే సంభవిస్తే ప్రాజెక్టులో నిల్వ చేసిన నీటిని ఒక్కసారిగా విడుదల చేసి డ్రాగన్ దీన్ని ‘వాటర్ బాంబు’గా వాడుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి మన ప్రభుత్వం ఈ సమస్యను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.