09-04-2025 12:00:00 AM
అమెరికా బెదిరింపులకు భయపడం
సుంకాలతో ఆర్థిక మాంద్యం ముప్పు: జేపీ మోర్గాన్ సీఈవో
బీజింగ్, ఏప్రిల్ 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు తాము భయపడబోమని చైనా స్పష్టం చేసింది. నిరాధార కారణాలతో అమెరికా సుంకాలను విధిస్తోందని ఆక్షేపించింది. తమపై అదనపు సుంకాలు విధిస్తామని బెదిరిస్తూ అమెరికా తప్పు మీద తప్పు చేస్తుందని పేర్కొంది. ‘చైనాపై సుంకాలు పెంచుతామని బెదిరిస్తూ అమెరికా తప్పు మీద తప్పు చేస్తోంది. దీని ద్వారా అమెరికా బ్లాక్‌మెయిల్ స్వాభావం మరోసారి బయటపడింది. ఒకవేళ అమెరికా తన నిర్ణయానికి కట్టుబడి ఉంటే చివరి వరకు మేము పోరాడుతాం. దేశ సార్వభౌత్వం, అభివృద్ధి ప్రయోజనాలు, భద్రతను దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకుంటాం’ అని చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసింది.
చైనాపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా దిగుమతులపై చైనా 34 శాతం టారిఫ్‌లు విధించింది. ఈ టారిఫ్‌లు ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. చైనా చేసిన ఈ ప్రకటనపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా దిగుమతులపై ప్రకటించిన సుంకాల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనిడిమాండ్ చేశారు. లేదంటే ఏప్రిల్ 9 నుంచి చైనా దిగుమతులపై 50 శాతం అదనపు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదన్నది. చైనా ఈ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే ఆ దేశానికి ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. చైనా దిగుమతులపై 104% సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సుంకాలు ఏప్రిల్ 9 నుంచే అమల్లోకి వస్తాయని శ్వేతసౌధం వెల్లడించింది.
ట్రంప్ ఆర్థికవేత్త కాదు
సుంకాల విధానాన్ని ట్రంప్‌కు మద్దతు ఇచ్చిన బిలియనీర్ బిల్ అక్మెన్ తప్పుబట్టారు. టారిఫ్‌ల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఆర్థిక అణు యుద్ధంగా అభివర్ణించారు. ట్రంప్ విధానాలు వాణిజ్య భాగస్వామిగా అమెరికాపై మిత్ర దేశాలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ ఆర్థికవేత్త కానందువల్లే పాలసీ తయారీకి సలహాదారులపై ఆధారపడ్డారని అభిప్రాయపడ్డారు. తప్పుడు లెక్కల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కిందకు పడిపోతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార దిగ్గజాల విశ్వా సాన్ని ట్రంప్ కోల్పోయారని అక్మెన్ పేర్కొన్నారు. ట్రంప్‌కు ఓటేసిన కారణంగా దేశ ప్రజలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నట్టు తెలిపారు. ఇందుకోసం కాదు కదా ఆయనకు ఓటేసిందని ఆవేదన వ్యక్తం చేశా రు. అమెరికా ప్రతిష్ఠ దెబ్బతీసే విధంగా ట్రం ప్ టారిఫ్ పాలసీ కొనసాగుతోందన్నారు.
సుంకాల ప్రభావంతో ద్రవ్యోల్బణం
ప్రతీకార సుంకాల ప్రభావంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, క్రమంగా ఆర్థిక మాద్యం వచ్చే అవకాశాలున్నాయని జేపీ మోర్గాన్ సీఈవో జెమి డిమోన్ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ భారీ స్థాయిలో కుదుపులకు లోనవుతుందని పేర్కొన్నారు. పన్ను సంస్కరణలు, డీ రెగ్యూలేషన్లు వంటి వి సానుకూల అంశాలైతే.. వాణిజ్యయుద్ధం, తీవ్ర ద్రవ్యోల్బణం, ఆర్థిక లోటు, ఆస్తుల విలువలు గణనీయంగా పెరగడం వంటివి ప్రతికూలాంశాలుగా పేర్కొన్నారు. ఆయన వాటాదారులకు విడుదల చేసిన వార్షిక లేఖలో పలు అంశాలను డిమోన్ ప్రస్తావించారు. ఈ క్రమంలోనే భారత్ వంటి అలీన దేశాల దేశాలకు స్నేహ హస్తాన్ని అందించడం ద్వారా అమెరికాకు మేలు జరుగుతుందని ఈ సందర్భంగా డిమోన్ అభిప్రాయపడ్డారు.
వెనక్కి తగ్గితే మేలు
చైనా టారిఫ్‌లపై వెనక్కి తగ్గాలని ట్రంప్‌కు ఎలాన్ మస్క్ సూచించినట్టు తెలుస్తోంది. ట్రంప్‌తో మస్క్ నేరుగా చర్చలు జరిపి, చైనాపై టారిఫ్‌ల విషయాన్ని పునరాలోచించు కోవాలని సూచించినట్టు సమాచా రం. అయితే, ట్రంప్ అందుకు విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.