17-04-2025 02:00:59 AM
డ్రాగన్ ప్రతీకార సుంకాలపై అగ్రరాజ్యం ఆగ్రహం
బోయింగ్ నుంచి ఆర్డర్లు తీసుకోవద్దని తమ విమాయాన సంస్థలకు ఆదేశాలిచ్చిన బీజింగ్
భారత్‌తో స్నేహం కోసం చూస్తున్న చైనా!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: అగ్రరాజ్యం అమెరికా అన్ని దేశాలపై రెసిప్రోకల్ టారిఫ్స్ వేసిన విషయం తెలిసిందే. అయితే చాలా మట్టుకు దేశాలు సైలెంట్‌గా ఉన్నాయి. చైనా మాత్రం అమెరికాపై ప్రతిగా సుంకాలు వేసింది. దీంతో అమెరికా సుంకాలను పెంచుతూ వెళ్లింది.. ఏ మాత్రం వెనుకడుగువేయకుండా చైనా కూడా సుంకాలను పెంచింది. ఈ చర్యలతో ఆగ్రహానికి గురైన అగ్రరాజ్యం ఆ దేశంపై దిగుమతి సుంకాలను 245 శాతానికి పెంచింది. ఈ మేరకు వైట్ హౌస్ మంగళవారం వెల్లడించింది. ‘అమెరికా విదేశీ ఉత్పత్తులపై అతిగా ఆధారపడుతోంది.
అలా ఆధారపడటం ఎప్పటికైనా ప్రమాదమే. ఇది ఆర్థిక శ్రేయస్సుకు ప్రమాదం కలిగిస్తుంది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని సుంకాల పెంపు నిర్ణయం తీసుకున్నాం’ అని వైట్‌హౌస్ తన ప్రకటనలో పేర్కొంది. ఇప్పటి వరకు ఈ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి సుంకాలు వేసుకున్నాయి. అమెరికా 145 శాతం దిగుమతి సుంకాలు విధిస్తే.. చైనా 125 శాతం వేసింది. ప్రతిగా చైనా కొన్ని వస్తువులను అమెరికాకు ఎగుమతి చేయకుండా నియంత్రించింది. ట్రంప్ ఇబ్బడిముబ్బడిగా సుంకాలు పెంచినా చైనా 2025 మొదటి త్రైమాసికంలో 5.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
సుంకాలపై చైనా సెటైర్
అమెరికా తాజాగా విధించిన 245 శాతం సుంకాలపై చైనా సెటైర్ వేసింది. సుంకాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పందిస్తూ.. ‘అసలు అమెరికాకే తెలియనంత గజిబిగా సుంకాలు వేస్తోంది. సుంకాలు ఎంతనే విషయం ఇప్పుడు వారే చెప్పాలి. సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో విజేతలు ఉండరు. ఇటువంటి యుద్ధాలు చేయాలని చైనా అనుకోవట్లేదు. అలాగే చైనా వీటికి భయపడదు’ అని తెలిపారు. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రావాల్సింది చైనానే అని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ వ్యాఖ్యానించారు.
భారతీయులకు 85 వేల కంటే ఎక్కువ వీసాలు..
అగ్రరాజ్యం అమెరికా చైనాపై సుంకాలతో విరుచుకుపడుతున్న వేళ డ్రాగన్ కంట్రీ భారతీయులకు జనవరి1 9 నడుమ 85వేల పై చిలుకు వీసాలను జారీ చేయడం గమనార్హం. భారత్‌కు చైనా రాయబారి ఫిహాంగ్ మాట్లాడుతూ.. ‘ఇంకా ఎక్కువ మంది భారతీయులు చైనాను సందర్శించాలి. అక్కడున్న భద్రతా, స్నేహపూర్వక వాతావరణం చూడాలి. ఈ ఏడాది ఇప్పటి వరకే 85వేల పై చిలుకు వీసాలను జారీ చేశాం. ఇంకా అధికంగా భారతీయ మిత్రులను చైనా ఆహ్వానిస్తోంది.’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.