బ్రహ్మపుత్రపై సూపర్ డ్యామ్ నిర్మించేందుకు సన్నాహాలు
డ్యామ్ నిర్మిస్తే ఈశాన్య రాష్ట్రాలకు నీటి కష్టాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 4: భారత్‌కు నష్టంకలి గించే మరో కార్యానికి చైనా పూనుకొన్నది. బ్రహ్మపుత్ర నదిపై భారీ జల విద్యుత్ కేంద్రం నిర్మించాలని చైనా అడుగులు వేస్తోందని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ (ఏఎస్‌పీఐ) ఓ నివేదిక విడుదల చేసింది.
నివేదికలోని అంశాలు
చైనా కుట్రకు సంబంధించి ఏఎస్‌పీఐ తన నివేదికలో వెల్లడించింది. బ్రహ్మపుత్ర నది భారత్‌లోకి ప్రవేశించే అర్ధచంద్రకార వంపు వద్ద ఈ డ్యామ్ నిర్మించాలని చైనా భావిస్తోంది. ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువమొత్తంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ప్రపంచంలోనే ఇది అత్యంత శక్తిమంతమైన డ్యామ్ అని చైనా చెబుతోంది.
ఒకవేల చైనా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు. వేసవిలో బ్రహ్మపుత్ర నీటిని మళ్లించేందుకు చైనాకు అవకాశం ఉంటుంది. దీంతో అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్ ప్రజలకు నీటి కష్టాలు తప్పవు. ఇదేకాకుండా వర్షకాలంలో బ్రహ్మపుత్రకు భారీ వరదలు వస్తాయి.
ఆ సమయంలో పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువ ప్రాంతాలు ముంపు బారిన పడుతాయి. ఈ ప్రాజెక్టు సరిహద్దుకు 30 కి.మీ. దూరంలోనే నిర్మిస్తుండటం వల్ల రక్షణ పరంగానూ భారత్‌కు సమస్యలు తప్పవు. యుద్ధ పరిస్థితుల్లో భారీగా నీటిని ఆయుధంగానూ ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.
మనకు సమస్యేంటి?
టిబెట్‌లో జన్మించిన బ్రహ్మపుత్ర నది భారత్ గుండా బంగ్లాదేశ్‌కు చేరి అక్కడ గంగానదితో కలుస్తుంది. ఈశాన్య రాష్ట్రాలకు బ్రహ్మపుత్ర వరదాయిని. అందువల్ల ఈ నదీ జలాల ప్రవాహ తీరు, పంపిణీ, నాణ్యత వంటి అంశాల సమాచారం మార్పిడిపై భారత్, చైనా మధ్య ఒప్పందం ఉంది.
ఇది తొలిసారిగా 2002లో చేశారు. ఆ తర్వాత 2008, 2013, 2018లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేశారు. చివరిసారిగా కుదిరిన ఒప్పందం 2023తో ముగిసింది. అయితే ఒప్పందం ప్రకారం ఏటా మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నది సమాచారాన్ని భారత్‌తో చైనా పంచుకోవాల్సి ఉంటుంది. కానీ చైనా సరిగ్గా ఇవ్వడం లేదు.