15-04-2025 12:00:00 AM
ఎగుమతుల కోసం కొత్త నిబంధనలు రూపొందిస్తున్న డ్రాగన్ కంట్రీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: అమెరికా నడుమ వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం అయింది. చైనా కొన్ని రకాల అరుదైన లోహాలను అమెరికాకు ఎగుమతి చేయడం నిలిపి వేసింది. ఇలా చైనా ఆపేసిన జాబితాలో అ రుదైన ఖనిజాలు, కీలక లోహాలు ఉన్నాయి. చైనా అమెరికాకు ఎగుమతులను ఆపేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొం ది. ఎగుమతులకు సంబంధించి చైనా కొత్త నిబంధనలు రూపొందిస్తున్నట్టు ఈ కథనం వెల్లడించింది. నిబంధనలు ఖరారు అయ్యే వరకు చైనా ఓడరేవుల నుంచి మాగ్నెట్ (అయస్కాంతం) ఎగుమతులు నిలిపేశారు. ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలకు పలు లోహలు, ఖనిజాల ఎగుమతులు శాశ్వతంగా నిలిచిపోనున్నాయి.
అమెరికాకు చైనా దిగుమతులే కీలకం
అగ్రరాజ్యం అమెరికాకు చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులు చాలా కీలకం. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఖనిజాల్లో దాదాపు 90 శాతం ఖనిజాలు చైనా నుంచే వస్తున్నాయి. రక్షణ, ఎలక్ట్రానిక్ వాహనాలు, ఇంధన, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో ఉపయోగించే 17 రకాల మూలకాలను అమెరికాకు చైనా ఎగుమతి చేస్తోంది. సమరియం, గాడోలినియం, టెర్బియం, డైప్రో సియం, లుటేనియం, స్కాండియం, యుట్టి రం వంటి అరుదుగా లభించే లోహాలను చైనా అగ్రరాజ్యానికి ఎగుమతి చేస్తోంది. అమెరికా ఒకే ఒక్క అరుదైన ఖనిజ గనిని కలిగి ఉంది. చైనాపై ట్రంప్ విధించిన సుంకాల కారణంగానే ఆ దేశం ఎగుమతులు నిలిపివేసినట్టు తెలుస్తోంది.
అమెరికాకు ఎందుకు ముఖ్యమంటే
అమెరికాలో ఉత్పత్తి అయ్యే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ మోటార్లలో చైనా నుంచి వచ్చే అరుదైన ఖనిజాలను ఉపయోగిస్తున్నారు. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోలు, మిస్సైళ్లు, శాటిలైట్ల తయారీ కోసం అమెరికా చైనా ఎగుమతి చేసే ఖనిజాల మీదే ఆధారపడాల్సి వస్తోంది.