calender_icon.png 10 January, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టీల్‌ప్లాంట్‌లో కూలిన చిమ్నీ

10-01-2025 01:08:23 AM

  1. * ప్రమాదంలో తొమ్మిది మంది మృతి
  2. * శిథిలాల కింద మరో 30 మంది.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
  3. * ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లాలో దుర్ఘటన

రాయ్‌పూర్, జనవరి 9: ఛత్తీస్‌గఢ్‌లోని ఓ స్టీల్‌ప్లాంట్‌లో గురువారం సాయంత్రం భారీ చిమ్నీ కుప్పకూలింది. ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మరో 30 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఎస్పీ భోజ్‌రామ్ పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ముంగేలి జిల్లా రాంబోడ్ గ్రామం బిలాస్‌పూర్  రాయ్‌పూర్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న కుసుమ్ స్టీల్ ప్లాంట్‌లో యాజమాన్యం పలు అభివృద్ధి పనులు చేపడుతున్నది.  ఈ క్రమంలో ‘సైల్  బల్క్’ మెటీరియల్ భద్రపరిచే భారీ చిమ్నీ ఉన్నట్టుండి కుప్పకూలింది.

ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, 30 మంది వరకు శిథిలాల కిందే ఉండిపోయారు. గాయాల పాలైన మరికొందరిని తోటి కార్మికులు బిలాస్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సర్గావ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక సిబ్బందితో కలిసి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముంగేలి కలెక్టర్ అశోక్ అగర్వాల్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికార వర్గాలు భావిస్తున్నాయి.