calender_icon.png 12 February, 2025 | 1:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖమ్మం మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

11-02-2025 01:40:18 AM

  1. ఒకే రోజు లక్ష బస్తాలు రాక 
  2. ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాలతో పాటు ఏపీ నుంచి తెచ్చిన రైతులు

ఖమ్మం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం మిర్చి మార్కెట్‌కు సోమవారం భారీ ఎత్తున మిర్చి పోటెత్తింది. దాదాపు లక్ష బస్తాల దాకా మిర్చిని తీసుకుని రావడంతో మార్కెట్ మొత్తం నిండి పోయింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబాబాద్, ఏపీ సరిహద్దు ప్రాంతాలైన ఎన్టీఆర్ జిల్లా నుంచి రైతులు భారీగా మిర్చిని తీసుకొచ్చారు.

దీంతో మార్కెట్ మొత్తం మిర్చి బస్తాలతో నిండిపోయింది. కాలు తీసి కాలు కదపలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు మిర్చి బస్తాలతో మార్కెట్ నిండిపోగా మరో వైపు సాయంత్రం వరకు ఇంకా వాహనాల్లో మిర్చిని తీసుకొస్తూనే ఉన్నారు. గతంలో ఇంత భారీ ఎత్తున మిర్చి ని ఖమ్మం మార్కెట్‌కు రాలేదు.

వరుసగా శని, ఆదివారాలు రెండు రోజులు సెలువు దినాలు కావడంతో పాటు గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో రైతులు మిర్చిని బాగా ఎండబెట్టుకుని, మార్కెట్‌కు తెచ్చారు. అయితే మిర్చి ధరలో పెద్దగా తేడా ఏమీ కనిపించలేదు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల తీవ్రత గణనీయం గా పడిపోతుండటంతో పాటు చైనా కు ఎగుమతులు స్థాయి కూడా పడిపోతుండటంతో రైతులు తమ వద్ద ఉన్న మిర్చి నిల్వలను తొందరగా అమ్ముకోవాలనే ఆలోచన చేయడంతో సోమవారం భారీగా మార్కెట్‌కు మిర్చిని తీసుకుని వచ్చినట్లు సమాచారం. 

జెండా పాట ప్రకారం మిర్చి కొంటలేరు

రెండు ఎకరాల్లో మిర్చి వేశాను. 18 క్విం టాళ్లు వచ్చింది. సాంకేతి క కారణాలు చూపి, ధర తగ్గిస్తున్నారు. జెండా పాటకు తగ్గట్టు కొంటలేరు. సోమవారం జెండా పాట రూ.14 వేలు ఉంటే కాంటా వేసేటప్పు డు నాణ్యత లేదని, తేమ శాతం, తాలు అధికంగా ఉందని ధర తగ్గించారు. క్విం టాలుకు రూ.13,200 మాత్రమే పడిం ది. ఈ ధర గిట్టుబాటు కాదు. ఖర్చులు పోనూ అప్పులే మిగులుతున్నాయి.

 బాదావత్ వీరన్న, మహబూబాద్ జిల్లా