22-04-2025 10:06:34 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు కుమ్మక్కై మిర్చి ధర అమాంతం తగ్గించారని ఆరోపిస్తూ మిర్చి విక్రయానికి తెచ్చిన రైతులు కాంటాలు కాకుండా అడ్డుకొని నిరసనకు దిగారు. గత వారం క్వింటాలు మిర్చికి 11 వేలకు పైగా ధర పెట్టగా ఇప్పుడు 6 నుంచి 7 వేలు మాత్రమే ధర పెడుతున్నారని, తీరా టెండర్లు తెరిచిన తర్వాత క్వింటాలుకు రెండు కిలోల చొప్పున కోత పెడుతూ కాంటాలు చేస్తున్నారని దీనితో తాము అటు ధర.. ఇటు తూకంలో నష్టపోవాల్సి వస్తుందని పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. రైతులు ఆందోళనకు దిగడంతో మిర్చి యార్డులో కొనుగోళ్ళు స్తంభించాయి. మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వరరావు రైతులతో మాట్లాడినప్పటికీ శాంతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొనడం వల్ల ఎస్సై కరుణాకర్ సిబ్బందితో యార్డుకు చేరుకొని రైతులతో మాట్లాడారు. ధర తక్కువ పడ్డ రైతులకు చెందిన మిర్చికి మళ్లీ టెండర్లు వేయిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.