calender_icon.png 28 December, 2024 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షా లతో మిర్చికి నష్టం

28-12-2024 02:32:08 AM

  • ఖమ్మం జిల్లావ్యాప్తంగా తడిసిన మిర్చి, ధాన్యం 
  • ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతల వేడుకోలు  

ఖమ్మం, డిసెంబర్ 27 (విజయక్రాంతి): అకాల వర్షాలు తమను ఆగం చేశాయని ఖమ్మం జిల్లా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండురోజులుగా జిల్లావ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. దీంతో కల్లాల్లోని మిర్చి, ధాన్యం రాశులు వర్షానికి తడిశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చి, అమ్ముకుని, సొమ్ము చేసుకుందామనే లోపే అకాల వర్షాలు కురిశాయి.

చాలా చోట్ల మిర్చి కల్లాల్లోనే తడిచిపోవడంతో అపారనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో పాటు మిర్చికి గిట్టుబాటు ధర కూడా లేదు. అరకొరగా వచ్చిన దిగుబడి కాస్తా అకాల వర్షాలకు తడవడంతో నాణ్యత తగ్గి, మరింత నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.

ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, కూసుమంచి, నేలకొండపల్లి, వైరా, బోనకల్, చింతకాని, మధిర, ఎర్రుపాలెం, కల్లూరు, తల్లాడ తదితర ప్రాంతాల్లో కల్లాల్లోనే మిర్చి తడిసి ముద్దయింది. అధికారులు మాత్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదు. సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని, జరిగిన నష్టాన్ని అంచనా వేసి, రైతులను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.