calender_icon.png 28 December, 2024 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుపాకులు పట్టి.. మురిసిపోయిన పిల్లలు

28-10-2024 03:20:58 PM

అత్యాధునిక ఆయుధాలపై అవగాహన కల్పించిన పోలీసులు

డాగ్​, బాంబ్​ స్క్వాడ్​ పనితీరుపై అవగాహన

జనగామలో ఆకట్టుకున్న ‘ఓపెన్​ హౌస్​’

జనగామ​ (విజయక్రాంతి): ‘రెప్పపాటులో శత్రువును మట్టి కరిపించే ఆయుధాలు.. ట్రిగర్​ నొక్కితే నిమిషానికి వందల తూటాలు దింపే తుపాకులు.. అల్లర్లలో ఆందోళనకారులను చెదరగొట్టే ట్రియర్​ గ్యాస్​ వెపన్లు.. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆధునాతన ఆయుధాలు..’ వీటిని చూసి విద్యార్థులు మురిసిపోయారు. ప్రత్యేక బలగాల వద్ద మాత్రమే కనిపించే ఆయుధాలు కళ్లముందే కనిపించడంతో సంబురానికి లోనయ్యారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం జనగామలోని ఓ ఫంక్షన్​ హాల్​లో జనగామ పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఓపెన్​ హౌస్​ కార్యక్రమం నిర్వహించారు.

డీసీపీ రాజమహేంద్రనాయక్​ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కలెక్టర్​ ఓపెన్​ హౌజ్​లో ఏర్పాటు చేసిన ఒక్కో ఆయుధం గురించి తెలుసుకున్నారు. అనంతరం పలు పాఠశాలల విద్యార్థులు అక్కడికి చేరుకుని ఆయుధాలను తిలకించారు. బాంబ్​ స్క్వాడ్​ వారు వివిధ రకాల బాంబులను, బాంబులు పెట్టినప్పుడు వాటిని తొలగించే ప్రక్రియను వివరించారు. 

ఇంపోర్టెడ్​ లేటెస్ట్​ వెపన్స్​...

ఓపెన్​ హౌజ్​లో ఏర్పాటు చేసిన ఆయుధాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేడిన్​ ఇండియాతో పాటు యూఎస్​ఏ, రష్యా, ఇంగ్లండ్​, బెల్జియంలో తయారైన ఆధునాతన తుపాకులను ప్రదర్శనలో ఉంచారు. వీటిని తిలకిస్తున్న విద్యార్థులకు పోలీసులు ఒక్కో వెపన్​ పనితీరును సవివరంగా వివరించారు. ఎస్​ఎల్​ఆర్​, క్యాబిన్​ మెషీన్​, ఏకే 47, ఇన్​సాస్​, గ్యాస్​ గన్​ వంటి ఆయుధాలను చేతబూని పిల్లలు పులకించిపోయారు. కలెక్టర్​ సైతం ఆ ఆయుధాలను పట్టుకుని పనితీరును అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా అల్లర్ల సమయంలో పోలీసులు ఉపయోగించే సేఫ్టీ వెపన్స్​, బుల్లెట్​ ప్రూఫ్​ దుస్తులను ఓపెన్​ హౌస్​లో ఉంచారు. డాగ్​ స్క్వాడ్​తో కాసేపు విన్యాసాలు చేయించారు. ఈ కార్యక్రమంలో జనగామ డీసీపీ రాజమహేంద్రనాయక్​, ఏపీసీ పార్థసారథి, ఎస్​హెచ్​వో దామోదర్​రెడ్డి, ఎస్సైలు భరత్​, రాజేశ్​, కానిస్టేబుళ్లు జితేందర్​, రామకృష్ణ, రామన్న తదితరులు పాల్గొన్నారు.