10-03-2025 05:57:41 PM
చికిత్సకు రూ.32 కోట్ల ఖర్చు అవుతుందన్న వైద్యులు..
అపన్న హస్తం కోసం ఎదురుచూపు..
బెల్లంపల్లి (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని టేకుల బస్తీకి చెందిన దేవిని కల్యాణ్ దాస్, కృష్ణవేణి దంపతులకు ఇద్దరు పిల్లలు, కుమార్తె సహస్ర (7) కు, కుమారుడు మహా వీర్ (4)కు వెన్నెముక కండరాల క్షీణత (స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ-ఎస్ఎంఏ) వ్యాధి సోకింది. అయితే చిన్నారుల చికిత్సకు రూ.32 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ వ్యాధి వెన్నుపూసలోని కండరాల బలహీనత, క్షీణతకు దారి తీస్తుంది. దీని ప్రభావంతో ఎక్కువసేపు నిలుచోలేరు... నడవలేరు... దీని నివారణకు ఒక్కొక్కరికి రూ.16 కోట్ల విలువైన ఇంజక్షన్ చేయాలని వైద్యులు సూచించారు.
పిల్లల తండ్రి కల్యాణ్ దాస్ హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో రూ 11 వేల వేతనానికి కంప్యూటర్ ఆపరేటరుగా పనిచేస్తుండగా తల్లి నర్సింగ్ పూర్తిచేసి బెల్లంపల్లిలోనే ఉంటూ తన పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. పిల్లల మందులకు రూ.10 లక్షల వరకు అప్పులు చేశామని, పిల్లలు ప్రస్తుత పరిస్థితుల్లో ఉండాలన్నా ఒక్కొక్కరికి రూ.6.50 లక్షల విలువైన సిరప్ చొప్పున ఇద్దరికి రూ.13 లక్షల విలువైన సిరప్లు వాడాలని వైద్యులు సూచించినట్లు కృష్ణవేణి తెలిపారు. ఎస్ఎంఏ నుంచి శాశ్వతంగా విముక్తి కల్పించడానికి అవసరమయ్యే ఇంజక్షన్ల కోసం దాతలెవరైనా ముందుకు వచ్చి.. తమ పిల్లలను కాపాడాలని దంపతులు కృష్ణవేణి, కల్యాణ్ దాస్ లు వేడుకుంటున్నారు. సాయం చేయాలనుకునే దాతలు 88974 94155 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని వారు వేడుకుంటున్నారు.