ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన అభిజీత గుప్తాకు పది సంవత్సరాలు. ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్నది. సాధారణంగా ఎక్కువమంది పిల్లలు హోం వర్క్ ఎప్పుడు అవుతుందా? ఎప్పుడెళ్లి ఆడుకుందామా? అని చూస్తుంటారు. ఇంకొందరైతే ఆటలకే ఎక్కువ సమయం కేటాయిస్తారు.
కానీ ఈ చిన్నారి మాత్రం స్కూల్ నుంచి వచ్చి.. హోం వర్క్ పూర్తి చేశాక.. కథలు రాయడానికి ఇష్టపడుతున్నది. ఏదో ఖాళీ సమయాల్లో రాస్తుంది కదా.. పెద్దగా ఆసక్తిగా ఉండవని అనుకోకండి.. తను రాసిన కథలకు అవార్డులు కూడా వచ్చాయి.
అభిజీత ఇప్పటి వరకు మూడు పుస్తకాలు రాయడం పూర్తి చేసింది. ప్రస్తుతం నాలుగోది రాస్తోందట. ‘హ్యాపినెస్ ఆల్ ఎరౌండ్’, ‘వియ్ విల్ షోర్లీ సస్టున్8, ‘టు బిగిన్ విత్ లిటిల్ థింగ్స్’ ఆమె రాసిన పుస్తకాల పేర్లు. చాలా తక్కువ సమయంలో దాదాపు పది వేల కాపీలు అమ్ముడయ్యాయి.
సహజంగా ఇంట్లో జరిగే చిన్న చిన్న సన్నివేశాలు, కరోనా సమయంలో జనాల జీవన విధానం వంటి అంశాల మీద ఇప్పటి వరకు కథలు, కవితలు రాసింది. ఇంకో విషయం ఏంటంటే.. హార్రర్ కథలు రాయడమంటే అభిజీతకు చాలా ఇష్టం. తన ప్రతిభతో ‘ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘గ్లోబర్ చైల్డ్ ప్రాడిజీ’ నుంచి ‘గ్రాండ్ మాస్టర్ ఆఫ్ రైటింగ్’ అనే అవార్డును కూడా అందుకుంది.
ఇంకా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం దక్కించుకుంది. ‘భవిష్యత్‌లో డాక్టర్ అవ్వాలనేదే అభిజీత ప్రధాన లక్ష్యం. అందుకే చదువును అస్సలు నిర్లక్ష్యం చేయదు. క్లాసులో కూడా ఎప్పుడూ ముందే ఉంటుంది.
స్కూల్ నుంచి వచ్చాక హోం వర్క్ రాసి, అప్పుడు కథలు మీద దృష్టి పెడుతుంది’ అని వాళ్లమ్మ అనుప్రియ చెబుతున్నారు. మరో విషయం ఏంటంటే.. ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన అన్‌స్టాపబుల్ 21 కార్యక్రమంలో స్థానం దక్కించుకుంది.