calender_icon.png 15 April, 2025 | 5:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించాలి

09-04-2025 12:54:30 AM

  1. నాణ్యమైన సన్న బియ్యం పేదలు సద్వినియోగం చేసుకోవాలి
  2. వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
  3. కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, ఏప్రిల్ 8 (విజయక్రాంతి): పిల్లలు పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్ళు కీలకమని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కొత్తకోట మండల కేంద్రంలోని దండుగడ్డ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలకు పోషక విలువలున్న ఆహార పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు పుట్టిన తర్వాత తొలి 2 ఏళ్ళు కీలకమని, పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలకు పౌష్టికాహారాన్ని అందించాలని అన్నారు. 

నాణ్యమైన సన్న బియ్యం పేదలు సద్వినియోగం చేసుకోవాలి

పేదలకు నాణ్యమైన సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతోనే, ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కొత్తకోట మండల కేంద్రంలోని రెండవ నెంబర్ రేషన్ దుకాణాన్ని సందర్శించి, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్ రిజిస్టర్, బియ్యం పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించి, రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం మాత్రమే పంపిణీ చేయాలని సూచించారు. బియ్యం తీసుకోవడానికి వచ్చిన స్థానికులతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సన్న బియ్యంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇకనుంచి ప్రతి నెల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన

కొత్తకోట మండల కేంద్రంలోని భగీరథ చౌరస్తాలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. వరి కొనుగోలు కేంద్రంలో వచ్చే రైతులకి అన్ని రకాల ఏర్పాటు చేయాలని సూచించారు. తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీనివాసులు, జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసిల్దార్ శ్రీనివాసులు, సహకార శాఖ సిబ్బంది నరేష్, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.