calender_icon.png 27 January, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులను చిదిమేస్తున్నారు

14-08-2024 03:20:05 AM

  1. కామాంధుల చేతిలో బలవుతున్న బాలికలు  
  2. నగరంలో 7 నెలల్లో 485 పోక్సో కేసులు 
  3. బాధితులకు భరోసాగా నిలుస్తున్న మహిళా భద్రతా విభాగం 
  4. గుడ్ టచ్‌టో టచ్‌పై అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 13 (విజయక్రాంతి): అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో చిన్నారులపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామాంధులు క్షణికావేశంలో చేసే తప్పు.. ఎందరో చిన్నారుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. వావి వరసలు మరచి అభం శుభం తెలియని కొందరు.. చిన్నారులపై మృగాలుగా ప్రవర్తిస్తున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట బాలికలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బాధిత చిన్నారులకు మేమున్నామని భరోసా కల్పిస్తోంది నగర మహిళా భద్రతా విభాగం.

ఇలాంటి సంఘటనలు జరగకుండా షీటీమ్స్, మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు సైతం  నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ యేడాది జనవరి 1వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు 485 పోక్సో కేసులు నమోదయ్యాయని మహిళా భద్రతా విభాగం డీఎస్పీ దార కవిత తెలిపారు. వీరిలో 80శాతం మంది ఆ చిన్నారులకు పరిచయస్తులే కావడం గమనార్హం. మరికొందరు రక్త సంబంధీకులు న్నారు. కనురెప్పలే కాటేసిన రీతిలో కన్నబిడ్డలపై కన్నేసి అఘాయిత్యానికి పాల్పడిన జాబితాలో 15 మంది తండ్రులున్నారు.

బాధిత చిన్నారులకు భరోసా..

కామాంధుల చేతిలో బలైన అభం శుభం తెలియని బాలికలకు మేమున్నామని భరోసా కల్పిస్తోంది నగర మహిళా భద్రతా విభాగం. బాధిత బాలికలు ఆ భయం నుంచి బయట పడేందుకు ప్రత్యేకంగా భరోసా సెంటర్లు నెలకొల్పి వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తోంది. ఎవరైనా చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే వెంటనే డయల్ 100, వాట్సాప్ ద్వారా అయితే 94906 16555 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు తెలుపుతున్నారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసి వారిపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి శిక్షలు విధిస్తున్నామన్నారు.  ఫిర్యాదు చేసిన బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. 

స్మార్ట్‌ఫోన్‌లో ప్రేమ పాఠాలు..

అరచేతిలో స్మార్ట్‌ఫోన్లు, పాఠశాల వయస్సులోనే ప్రేమ పాఠాలు.. ఇది ప్రస్తుత జీవన విధానం. తమ తోటి స్నేహితులను చూసి కూడా కొంతమంది బాలికలు ప్రేమకు ఆకర్షితులవుతున్నారు. ప్రేమ పేరిట వల విసిరి యువకులు, పెళ్లి అయిన మధ్యవయస్కులు కూడా బాలికలను లోబర్చుకుంటున్నారు. ఈ యేడాది బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిలో 335 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతి 100 కేసుల్లో 50 శాతం బాధితులు 15 సంవత్సరాల బాలికలే. తరువాత స్థానంలో 10 యేళ్ల బాలికలు ఉన్నారని అధికారులు తెలిపారు. 

గుడ్ టచ్ టచ్‌పై అవగాహన ముఖ్యం.. 

చిన్నారులు కామాంధుల బారిన పడకుండా ఉండాలంటే గుడ్ టచ్‌న టచ్‌పై  అవగాహన చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. పిల్లలు తమ తల్లిదండ్రులతో ఎలాంటి సమస్యనైనా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలని, ఏం జరిగినా మేమున్నామనే భరోసా వారిలో కల్పించాలని పోలీసులు సూచిస్తున్నారు.

600 మంది వలంటీర్లకు శిక్షణ..

తాజాగా నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాలతో షీటీమ్స్, మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో 300 మంది ఉపాధ్యాయులు, 300 మంది ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి పాఠశాలలో ఇద్ద్దరు ఉపాధ్యాయులు తమ విద్యార్థులకు లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడేవారి ప్రవర్తన, బయట పడేందుకు అనుసరించాల్సిన పద్ధతులను వివరించడంతో పాటు గుడ్ టచ్ అవగాహన కల్పిస్తారు. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులను గుర్తించడం, పోలీసులకు ఫిర్యాదు చేసి కామాంధుల చేతిలో బలైన చిన్నారులకు ఆ భయం నుంచి బయట పడేందుకు తోడ్పాటు అందిస్తారు. అలాగే ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు వాడవాడలా తిరిగి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

పిల్లలకు భరోసానివ్వాలి

ప్రస్తుత ఆధునిక యుగంలో తల్లిదండ్రులు పాలు తాగే చిన్న పిల్లల నుంచి పాఠశాలలకు వెళ్లే పిల్లల వరకు చేతిలో ఫోన్ పెట్టి వారి పనులు చేసుకుంటున్నారు. కనీసం రోజులో ఒకగంట సమయం కూడా వారితో మాట్లాడడానికి కేటాయించడం లేదు. ఇలా చేయడం వలన పిల్లలు, తల్లిదండ్రల మధ్య బంధం బలహీనపడుతుంది. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంట, బయటా ఎదురయ్యే ఎలాంటి సమస్యలపైనా అయినా ధైర్యంగా మాట్లాడే  స్వేచ్ఛ ఇవ్వాలి. ఏం జరిగినా మేమున్నామనే భరోసానిచ్చినివ్వాలి. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ చూపితేనే ఇలాంటి నేరాలు జరుగకుండా అడ్డుకట్టవేయవచ్చు.

 దార కవిత, డీసీపీ, నగర మహిళా భద్రతా విభాగం