calender_icon.png 28 October, 2024 | 5:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నోళ్లు.. పెద్దోళ్లు

24-07-2024 01:22:34 AM

  • స్కేట్ బోర్డులో 11 ఏళ్ల చిన్నారి 
  • ఈక్వెస్ట్రియాన్‌లో 61 ఏళ్ల బామ్మ 
  • పారిస్ ఒలింపిక్స్

సాధించాలనే తపన ఉంటే.. వయసు అడ్డంకి కాదని నిరూపించినవాళ్లు కోకొల్లలు. ఇదే బాటలో మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లోనూ పలువురు పిన్న వయస్కులు, పెద్ద వయస్కులు పతకాలు పట్టేందుకు సిద్ధమవుతున్నారు. పారిస్ విశ్వక్రీడల్లో చైనాకు చెందిన 11 ఏళ్ల చిన్నది స్కేట్‌బోర్డుపై సంచలనాలు సృష్టించాలని చూస్తుంటే.. కెనడాకు చెందిన 61 ఏళ్ల బామ్మ ఈక్వెస్ట్రియాన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇక భారత్ నుంచి పిన్న వయసు అథ్లెట్‌గా14 ఏళ్ల స్విమ్మర్ ధినిధి బరిలో ఉండగా.. వెటరన్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న 44 ఏళ్ల వయసులో పోటీకి సై అంటున్నాడు.

స్యూఢిల్లీ: ప్రతిభకు వయసు ప్రతిబంధకం కాదని నిరూపిస్తూ.. విశ్వక్రీడల్లో సత్తాచాటేందుకు పలువురు అథ్లెట్లు సిద్ధమవుతున్నారు. మరో రెండు రోజుల్లో పారి స్‌లో ప్రారంభం కానున్న ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ బరిలో ఉన్న వారిలో చైనాకు చెందిన 11 ఏళ్ల స్కేట్‌బోర్డర్ జెంగ్ హొహో అత్యంత పిన్నవయస్కురాలు కాగా.. కెనడా ఈక్వెస్ట్రియాన్ జట్టు సభ్యురాలు జిల్ ఇర్వింగ్ అతి పెద్ద వయస్కురాలు. ఈ ఇద్దరి మధ్య ఐదింతలు అంతరం ఉండటం గమనార్హం.

వయసు అంకె మాత్రమే..

ఆరు పదులు దాటాయంటే చాలు ఇక అంతా అయిపోయింది అనుకునేవాళ్లకు కెనడా ఈక్వెస్ట్రియాన్ ప్లేయర్ జిల్ ఇర్వింగ్ స్ఫూర్తిగా నిలుస్తోంది. 61 ఏళ్ల వయసులో తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఈ బామ్మ.. గుర్రపుస్వారితో ఆకట్టుకునేందుకు రెడీ అయింది. ఐదు దశాబ్దాల క్రితమే గుర్రపుస్వారీపై ఉన్న మక్కువతో స్థానిక క్లబ్‌లో చేరిన ఇర్వింగ్.. ఇన్నాళ్లకు తన కల సాకారం చేసుకోనుంది. కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో పడి తన ఇష్టాలను పక్కన పెట్టిన ఇర్వింగ్.. 2008 నుంచి సాధనకు పదును పెంచింది. ఇర్వింగ్ అద్భుత ప్రదర్శనతో కెనడా జట్టు 2019 పాన్ అమెరికా క్రీడల్లో స్వర్ణం సాధించగలిగింది. 

ఇటు బొపన్న.. అటు ధినిధి

మూడోసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్న సీనియర్ టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న.. భారత్ నుంచి పారిస్ క్రీడల్లో పోటీ పడుతున్న పెద్ద వయస్కుడిగా నిలవనున్నాడు. 44 ఏళ్ల వయసులో బోపన్న పతకం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాడు. ఈ క్రీడల్లో భారత్ నుంచి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్, ఆర్చర్ తరుణ్‌దీప్ కూడా నాలుగు పదులు దాటిన వయ సులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఓవరాల్‌గా భారత్ నుంచి అతి పెద్ద వయసులో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్‌గా షూటర్ భీమ్ సింగ్ బహదూర్ రికార్డుల్లోకెక్కాడు. 1976 క్రీడల్లో భీమ్ సింగ్ 66 ఏళ్ల వయసులో బరిలో నిలిచి అదుర్స్ అనిపించాడు. మరోవైపు 14 ఏళ్ల స్విమ్మర్ ధినిధి భారత్ నుంచి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొననున్న పిన్న వయస్కురాలిగా నిలవనుంది.

ఆడిపాడే వయసులో..

11 ఏళ్ల పిల్లలు సాధారణంగా ఏం చేస్తారు.. ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి స్కూల్‌కు వెళ్తారు అనే కదా మీరు అనుకుంటున్నది. కానీ.. చైనాకు చెందిన పదకొండేళ్ల స్కేట్‌బోర్డర్ జెంగ్ హొహో మాత్రం పిన్న వయసులోనే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పోటీ పడనుంది. టోక్యో ఒలింపిక్స్ నుంచి విశ్వక్రీడల్లో ప్రవేశ పెట్టిన స్కేట్ బోర్డు క్రీడలో జెంగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. వచ్చే నెల 11తో పన్నెండో పడిలోకి అడుగుపెట్టనున్న జెంగ్ హొహో.. ఓవరాల్‌గా ఒలింపిక్స్‌లో పాల్గొననున్న రెండో పిన్న అథ్లెట్‌గా రికార్డుల్లోకి ఎక్కనుంది.

1896 ఒలింపిక్స్‌లో గ్రీస్‌కు చెందిన జిమ్నాస్ట్ దిమిత్రోస్ పదేళ్ల 218 రోజుల వయసులోనే విశ్వక్రీడల బరిలో దిగింది. బుడాపెస్ట్, షాంఘైలో నిర్వహించిన క్వాలిఫయింగ్ టోర్నీల్లో సత్తాచాటి పారిస్ క్రీడలకు ఎంపికైన జెంగ్.. విశ్వక్రీడల్లోనూ జోరు కొనసాగిస్తానని ధీమాగా చెప్తోంది. గత ఒలింపిక్స్‌లో స్కేట్ బోర్డు పోటీలను వీక్షించి సాధన ప్రారంభించి దానిపై ఇష్టం పెంచుకున్న జెంగ్.. ఇప్పుడు ప్రపంచ మేటి స్కేట్ బోర్డర్లతో తలపడనుంది. అర్ధచంద్రాకారంలోని ర్యాంప్‌పై శరీరాన్ని విల్లులా వంచుతూ.. పాదాలకున్న చక్రాలతో చక్కర్లు కొట్టే ఈ క్రీడలో జెంగ్ సత్తాచాటాలని ఆశిద్దాం.