డా. కందేపి రాణీప్రసాద్
బాలలకు సైతం పెద్దవారికి మాదిరిగా ప్రత్యేక హక్కులు ఉన్నాయని ఎంతమందికి తెలుసు? చిన్నా, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికీ రాజ్యాంగం కొన్ని హక్కులు, బాధ్యతలను కల్పించింది. వాటిని అతిక్రమించే అధికారం ఎవరికీ లేదు. బాలల రక్షణకు సంబంధించి కొన్ని చట్టాలుకూడా ఉన్నాయి. వారి హక్కుల్ని పరిరక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. వీటిని అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవు. కానీ, సాధారణ సమాజంలో బాలల చట్టాల గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ హక్కులు, చట్టాల గురించి అవగాహన కలుగజేస్తే బాగుంటుంది.
బాల్యానికి పాతర
మనం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాం. ఈనాడు ఏ ఉపాధ్యాయుడికీ పిల్లల సమస్యల గురించి పట్టడం లేదు. కనీసం పసివాడు ఎంత చదవగలడు? ఎంత రాయగలడు? అన్న వివేచన కూడా ఉండదు. పిల్లవాడు అల్లరి చేయకుండా చూడటమే వారి పని. ఉదుకే, పిల్లలు కదలకుండా, మాట్లాడకుండా కాపలా కాస్తుంటారు. శ్రుతిమించిన క్రమశిక్షణ పిల్లల్లోని సృజనాత్మకతను, సహజ సిద్ధతనూ కోల్పోయేలా చేస్తుంది. ఉత్సాహం, చలనం లోపించిన బాలలు ప్రాణం లేని బొమ్మలతో సమానం. పిల్లల్లోని సహజత్వానికి భంగం కలుగకుండా పాఠాలు బోధించాలి. సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని కోల్పోయిన పిల్లల్ని ‘బాలలు’ అనలేం. ఏ వయసు పిల్లలకు ఎంత హోమ్ వర్క్ అవసరమో అంతే ఇవ్వాలి. వారి ఆటపాటల సమయాన్ని హరించే పెద్ద హోమ్ వర్క్‌లు పిల్లల ఉల్లాసానికి గొడ్డలి వేట్లు.
భారంగా భావిస్తున్న తల్లిదండ్రులు
తల్లిదండ్రులు సైతం పిల్లల పెంపకాన్ని భారంగానే చూస్తున్నారు. తమ చదువులు, ఉద్యోగాలు, కెరీర్‌పైనే శ్రద్ధ పెడుతూ పిల్లల్ని అనవసర భారంగా భావిస్తున్నారు. లక్షల రూపాయల ఫీజులైనా కట్టేసి పెద్దపెద్ద స్కూళ్ళలో చేర్పించేసి తమ బాధ్యత తీరిపోయినట్లుగా చేతులు దులుపుకుంటున్నారు. హాస్టళ్లలో వారి అవస్థలు చెప్పనలవి గాదు. గడుసు పిల్లలకు సమస్యలేం రాకపోవచ్చు. కొంతమంది సున్నిత మనస్కులు ఉంటారు. అటువంటి పిల్లలు తమ సమస్యలను అందరికీ చెప్పుకోలేరు. వారు కొన్నిసార్లు తల్లిదండ్రులవద్ద కూడా నోరు విప్పి తమ బాధలు చెప్పరు. పెద్ద క్లాసు పిల్లలు, రౌడీ పిల్లలు తమ హోమ్ వర్కుల్నీ, మిగతా పనుల్నీ నెమ్మదస్తులతో చేయిస్తుంటారు. ఇవి టీచర్లదాకా వెళ్లవు. ఒకవేళ వెళ్లినా గడుసు పిల్లల్నే తెవివిగల పిల్లలుగా టీచర్లు మెచ్చుకుంటుంటారు. నిదానస్తులకు, నిజాయితీ పరులకు ఎక్కువ పేరు ప్రతిష్ఠలు రావు.
హక్కుల దినోత్సవం
ప్రపంచ వ్యాప్తంగా ‘బాలల హక్కుల దినోత్సవం’ జరుపుకుంటారని తెలుసా? బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబరు 20న జరుపుకుంటారు. ‘ఐక్యరాజ్యసమితి’ (ఐరాస) 1954 డిసెంబరు 14న ఒక తీర్మానం ద్వారా ప్రతి సంవత్సరం ‘ప్రపంచ బాలల దినోత్సవాన్ని’ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు 1959లో ‘ఐరాస’ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. బాలల సంక్షేమం, వారి హక్కులు కాపాడటం కోసం విద్యాసంస్థల అధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తారు. ఇంకా స్వచ్ఛంద సంస్థలు వంటివి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు జరుపుతాయి.
హింసా, దౌర్జన్యాలు
బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం. బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు వీరి హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి ప్రాథమిక హక్కు. ఇది ప్రతి ఒక్కరికీ మౌలిక స్థాయిలో ఉచితంగా లభించాలి. నిర్బంధంగానైనా బాలలందరికీ విద్యాహక్కు అమలు కావాలి. అప్పుడే నవ భారతంలో కాబోయే నూతన పౌరులు దేశాన్ని రక్షించుకోగలుగుతారు. బాలలు అత్యధికంగా హింసకు గురవుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ అధ్వర్యంలో బాలల గురించి సర్వేలు జరిగాయి. ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల బాలలపై ఎక్కువగా హింసతోపాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
భౌతిక, లైంగిక, మానసిక దాడులకు పిల్లలు బలవుతున్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదు. బాల కార్మికులు ఇంతకు పూర్వం ఇటుక బట్టీలలో, కొండల తవ్వకాలలో, గ్రానైట్ క్వారీలలో పని చేసేవారు. ప్రమాద పరిస్థితుల్లో పని చేసే బాలలను మాత్రమే మొదట్లో ‘బాల కార్మికులు’ అనేవారు. ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ రూపం మార్చుకుని స్కూళ్లలో చేరింది. బస్తాలకొద్దీ పుస్తకాలు మోయటం, రాత్రనక పగలనక రాసినవే రాయటం, రకరకాల టెస్ట్ (స్లిప్, వీక్లీ, మంత్లీ)లతో పిల్లలను మనఃశ్శాంతికి దూరం చేయడం వంటివన్నీ నేటి స్కూళ్లలో నిత్యకృత్యమై పోయాయి. పెద్ద పేరున్న స్కూళ్ల ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది బాలలు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనికి తల్లిదండ్రులు నిర్లక్య ధోరణి, నిరాదరణ వంటివి చాలావరకు కారణమవుతున్నాయి.
పార్లమెంటు చేసిన చట్టాలు
బాలల సంక్షేమం కోసం మన పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యాయసేవల చట్టం, నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరీక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సరఫరా చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసింది. ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేక నిబంధనలు రూపొందించవచ్చు. సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేక హక్కు ఆర్టికల్ 15 ద్వారా, వ్యక్తిగత స్వేచ్ఛ , న్యాయ ప్రక్రియ హక్కు ఆర్టికల్ 21 ద్వారా, అక్రమ రవాణా నుంచి రక్షణను పొందే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరిచారు. ఈ విధంగా పెద్దవారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు సమకూరాయి. ఇవే కాకుండా, హిందూ వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టం, న్యాయ చట్టాలు వంటివి కూడా బాలల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన సెక్షన్లను కలిగి ఉన్నాయి. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు పూర్తి బాధ్యత వహించాలి.
లక్షల్లో బాలకార్మికులు
వాస్తవానికి భారత్‌లో ఇప్పటికీ పిల్లలను పనిలో పెట్టుకోవడంపై నిషేధం ఉన్నా లక్షలాదిగా పేద పిల్లలు దేశంలో బాల కార్మికులుగా కఠోర జీవితం వెళ్లదీస్తున్నారు. కార్ఖానాల్లో, పరిశ్రమల్లో, ఇటుక బట్టీల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో, ఇళ్లలో, షాపుల్లో, హోటళ్లలో, రోడ్ల పక్కన తినుబండారాల బండ్లవద్ద, ఇంకా అనేక ప్రమాదకరమైన పరిస్థితుల్లో నిరుపేద పిల్లలు వయసుకు మించిన పనులు చేస్తూ కనిపిస్తుంటారు. ప్రపంచంలోనే అత్యధికంగా బాల కార్మికులు ఉండే దేశం భారత్ కావడం అత్యంత దురదృష్టకరం.
కార్మిక శాఖ లెక్కల ప్రకారం దేశంలో 50 లక్షలమంది బాల కార్మికులు ఉన్నారు. వాస్తవానికి ఆ సంఖ్య 5 కోట్లకన్నా ఎక్కువ అని ‘బచ్‌పన్ బచావో’ సహా పలు ఎన్జీవోలు (స్వచ్ఛంద సంస్థలు) స్పష్టం చేస్తున్నాయి. బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్ సత్యార్థికి గతంలో నోబెల్ పురస్కారం లభించడంతో భారత్‌లోని బాలకార్మిక వ్యవస్థపై ఒక్కసారిగా ప్రపంచం దృష్టి పడింది. నేడు ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కులపట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కానీ, ఆచరణలో అమలు సాధ్యం కావటం లేదు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరిచి ఉన్నాయి కనుక అవి పూర్తి స్థాయిలో ఆచరణకు నోచుకొనేలా చూడడం ప్రతి ఒక్కరి బాధ్యత.