02-03-2025 12:54:06 AM
గత ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మల్టీప్లెక్స్, సినిమా హాళ్లలో ఉదయం 11 గంటలకు ముందు, రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను అనుమతించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సవరించింది. సినిమాలకు పిల్లల ప్రవేశంపై చట్టపరంగా ఎలాంటి నిబంధన లేకపోవడంతోపాటు, మల్టీప్లెక్స్, సినిమా థియేటర్లకు ఎదురవుతున్న నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఉత్తర్వులను సవరించినట్లు పేర్కొంది.
అయితే అన్ని వర్గాలతో చర్చించి పిల్లల ప్రవేశంపై విధాన నిర్ణయం తీసుకోవాలంటూ ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలు సత్వరం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ విచారణను ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది. రాత్రి 11 తర్వాత, ఉదయం 11లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదంటూ జనవరి 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను తొలగించాలని కోరుతూ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తదితరులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డి ఇటీవల విచారణ చేపట్టారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి.. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో నుంచి 16 ఏళ్లలోపు పిల్లలను 11కు ముందు, రాత్రి 11 తర్వాత అనుమతించరాదన్న భాగాన్ని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకో వాలన్న గత ఉత్తర్వుల అమలుపై ప్రభుత్వం సత్వరం చర్య తీసుకోవాలని ఆదేశించారు.