ప్రపంచవ్యాప్తంగా సగటున 15 శాతం జంటలు సంతానలేమితో బాధపడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. సంతానలేమి.. దీన్నే ఇన్‌ఫెర్టిలిటీ అంటారు. చాలామందిలో ఉండే అపోహ ఏంటంటే.. సంతానలేమి సమస్య కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఉంటుందని అనుకుంటారు. కానీ.. ఇన్‌ఫెర్టిలిటీ సమస్య మగవారిలోనూ ఉండొచ్చు. అసలు సంతానలేమికి కారణాలు ఏంటి? ఈ జనరేషన్‌లో సంతానలేమి సమస్యలు పెరగడానికి కారణం ఏంటి? సంతానలేమి సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? అనే విషయాల గురించి తెలుసుకుందాం..
కొన్ని సందర్భాల్లో స్త్రీ, పురుషుడు ఇద్దరిలో ఎలాంటి సమస్య లేకున్నా గర్భం దాల్చడంలో ఆలస్యమవుతుంది. సంతానలేమికి ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. అదేవిధంగా పొగాకు, మద్యం, అధిక బరువు, తక్కువ బరువు, అనారోగ్యకర జీవన శైలి వంటివి కూడా సంతానలేమికి కారణాలు. అయితే ప్రస్తుతం టెక్నాలజీ వాడకం కూడా పెరిగింది. ఇవన్నీ సంతానలేమికి దారితీస్తున్నాయి.
అసలు సమస్య ఎక్కడ?
సంతానం కలగకపోతే, ముందుగా దానికి సమస్య మగవారి దగ్గర ఉందా? లేదా స్త్రీ వద్ద ఉందా? అని తెలుసుకోవాలి. అయితే మగవారి కారణాలు తెలుసుకోవడం చాలా తేలిక. దీనికోసం వీర్య పరీక్ష చేస్తే తెలిసిపోతుంది. మూడు రోజులు శారీరకంగా కలవకుండా ఉండి ఏదైనా పరీక్ష కేంద్రంలో ‘వీర్యం విశ్లేషణ’ పరీక్ష చేయాల్సి ఉంటుంది. అది నార్మల్ ఉంటే దాదాపు సగం సమస్య లేనట్టే. కానీ అందులో ఏమైనా సమస్య ఉంటే, అది కణాల ఉత్పత్తిలోనా? ఇన్ఫెక్షన్ వల్లనా? అనే కోణంలో పరీక్షలు జరిపి చికిత్స తీసుకోవాలి.
నెలసరిలో మార్పులు..
సమస్య మగవారిలో లేదు అని తెలిశాక, స్త్రీ సంబంధిత కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూడాలి. అలాగే గర్భ సంచి లోపలి పొరలో పిండం ఏర్పడితే, దాని ఎదుగుదలకు దోహదపడేలా సిద్ధం అవుతుందా? అని కూడా డాక్టర్లు గమనిస్తారు. స్త్రీ సంబంధిత కారణాలలో అండం విడుదలలో సమస్య కూడా ఉండొచ్చు. లేక పిండం ఏర్పడటంలో లేదా దాని ఎదుగుదలలో సమస్య ఉండొచ్చు. రుతుక్రమం సరిగ్గా ఉండే మహిళల్లో నెలసరి ప్రారంభానికి, పద్నాలుగు రోజుల ముందు అండం విడుదల అవుతుంది. అది వీర్య కణాలతో కలిస్తే పిండంగా మారుతుంది. లేనప్పుడు రుతుక్రమంలో రక్తస్రావం అవుతుంది. కాబట్టి నెలసరి మొదలైన పదకొండు లేదా పన్నెండవ రోజు నుంచి అండం ఎదుగుదలను గమనిస్తూ ‘అండతర్గత అధ్యయనం’ చేస్తారు.
వయసు ప్రభావం..
సంతానలేమికి వయస్సు మరో కారణం. ప్రస్తుతం మహిళలు 30 ఏళ్లు, మగవారు 35 ఏళ్లు నిండాక పెళ్లి చేసుకుంటున్నారు. వయసు ఎక్కువగా ఉండి పెళ్లి చేసుకుంటున్నవారిలో అధికంగా సంతానలేమి సమస్య కనిపిస్తోంది. అంతేకాదు సిగరేట్, మద్యం అలవాట్లు ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అసలు సంతానమే కలగడం లేదు. అలాంటి జంటలకు కృత్రిమ గర్భధారణ కేంద్రాలు చేయూతనిస్తున్నాయి.
కృత్రిమ గర్భధారణ ద్వారా..
కృత్రిమ గర్భధారణ, ముఖ్యంగా ఐవీఎఫ్ సంతానం లేని దంపతులను తల్లిదండ్రులుగా మారుస్తోంది. ఐవీఎఫ్ అనేది కృత్రిమ ఫలదీకరణంలో ఒక పద్ధతి. దీన్ని ‘ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్’ అంటారు. ఈ పద్ధతిలో ఫలదీకరణం కోసం స్త్రీ అండంను పురుషుడి శుక్ర కణాలతో కృత్రిమంగా కలపడం జరుగుతుంది. టెక్నాలజీ సాయంతో లేబొరేటరీలో దీన్ని పూర్తి చేస్తారు. అంటే స్త్రీ అండం, పురుషుడి కణాలను ముందుగా సేకరిస్తారు. భర్త శుక్రకణాన్ని ప్రయోగశాలలో అండంతో కలుపుతారు. తర్వాత సంతానోత్పత్తిని పర్యవేక్షించేందుకు చికిత్సను అందించడానికి తిరిగి గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఈవిధంగా కృత్రిమ గర్భధారణ ద్వారా చాలామంది తల్లిదండ్రులయ్యారు.
ప్రతి ఆరు జంటల్లో ఒకరికి..
సంతానోత్పత్తి చికిత్సల గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఐవీఎఫ్ చికిత్సా విధానం సర్వసాధారణమైపోయింది. వాస్తవానికి ప్రతీ ఆరు జంటల్లో ఒక జంట ఐవీఎఫ్ ఫలదీకరణ పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. స్త్రీ, పురుషుల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులే సంతానలేమికి కారణమవుతున్నాయి. ఇందులో ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు నిపుణులు.
అవగాహన అవసరం..
ఐవీఎఫ్ కోసం ఆశ్రయించే జంటల్లో లేదా దంపతుల్లో 30 శాతం లోపం స్త్రీలలో, 30 శాతం లోపం మగవారిలో ఉండటంతో సహజ పద్ధతుల్లో గర్భధారణ జరగడం లేదు. అందుకే సంతానం కోసం దంపతులు ఇద్దరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. అలా చేయడం వల్ల గర్భధారణ సులభంగా జరుగుతుంది.
సక్సెస్ రేట్..
ఐవీఎఫ్ ఫెర్టిలైజేషన్‌లో బిడ్డ పుట్టే సక్సెస్ రేటు అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది దంపతుల వయసు, వారి ఆరోగ్యం, కణాల రకం, అండం స్వభావంపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ చాలా మంది ఐయూఐ లేదా ఐవీఎఫ్ పద్ధతుల ద్వారా పిల్లలకు జన్మనిస్తారు. ఐవీఎఫ్ ఫలదీకరణ పద్ధతిలో ఇంజెక్షన్లు, మందులు వరుసగా పరీక్షలు ఉంటాయి. ఇది కొన్నిసార్లు మన రోజువారీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఐవీఎఫ్ ద్వారా సంతానం పొందాలనుకునే దంపతులు తమ పని వేళలను చికిత్స చేస్తున్న డాక్టర్‌తో చర్చించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
సైడ్ ఎఫెక్ట్స్..
అయితే ఐవీఎఫ్ ఫలదీకరణ పద్ధతిలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. వాపు, తలనొప్పి, చికాకు లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి దాని గురించి ముందుగానే తెలుసుకోవడం అవసరం.
చికిత్సకు ఎంత ఖర్చు అవుతుంది?
ఈ చికిత్స ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటుంది. కాబట్టి వైద్యుని సలహాతోపాటు సరైన మార్గదర్శకత్వంలో మాత్రమే ఈ చికిత్స పద్ధతిని ఎంచుకోవాలి. ఫలదీకరణం పద్ధతికి అయ్యే ఖర్చు ముందుగానే తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఐవీఎఫ్ ఫెర్టిలైజేషన్‌లో బిడ్డ పుట్టడానికి అయ్యే ఖర్చు ఎక్కువ. మరి ఇంత మొత్తం వస్తుందని ముందే చెప్పలేం. ఎందుకంటే చికిత్స పద్ధతి, వ్యవధిని బట్టి ఖర్చు కూడా మారుతూ ఉంటుంది.
సంతానలేమికి కారణాలు
- స్త్రీలలో అండాశయ, గర్భాశయ లోపాలు, నెలసరి సమస్యలు.
- అండం పెరుగుదల, విడుదల సక్రమంగా లేకపోవడం.
- అండాశయ నాళాలు మూసుకుపోవడం.
- అండాశయాల్లో నీటి బుడగల్లాంటివి ఏర్పడటం.
- గర్భాశయ అంతర్భాగం, గర్భధారణకు సిద్ధపడక పోవడం.
- గర్భాశయ ముఖ ద్వారం ఆరోగ్యంగా లేకపోవడం.
- పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం.
- వీర్యకణాల నాణ్యత లేకపోవడం.
- వృషణాలు, వీర్యనాళాల్లో లోపాలు.
- హార్మోన్ల స్థాయిలో లోపాలు.
- ప్రతికూల వాతావరణంలో దంపతులు పని చేస్తుండటం.
డాక్టర్ పద్మజా దివాకర్, ప్రముఖ గైనకాలజిస్టు
డా॥ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం
స్ట్రీట్ నెం.7, హబ్సిగూడ, హైదరాబాద్